క్వాంటమ్‌ సైన్స్‌ దిగ్గజాలకు భౌతికశాస్త్ర నోబెల్‌

క్వాంటమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌లో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ పురస్కారం వరించింది. సురక్షిత కమ్యూనికేషన్‌ సాగించేలా ఎన్‌క్రిప్షన్‌ రంగంలో అనేక ప్రయోజనాలకు వీరి ఆవిష్కరణలు బాటలుపరిచాయి.

Published : 05 Oct 2022 06:13 IST

అలెన్‌ ఆస్పెక్ట్‌, క్లాజర్‌, జైలింగర్‌కు అత్యున్నత పురస్కారం

స్టాక్‌హోం: క్వాంటమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌లో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ పురస్కారం వరించింది. సురక్షిత కమ్యూనికేషన్‌ సాగించేలా ఎన్‌క్రిప్షన్‌ రంగంలో అనేక ప్రయోజనాలకు వీరి ఆవిష్కరణలు బాటలుపరిచాయి.

అలెన్‌ ఆస్పెక్ట్‌ (ఫ్రాన్స్‌), జాన్‌ ఎఫ్‌ క్లాజర్‌ (అమెరికా), ఆంటోన్‌ జైలింగర్‌ (ఆస్ట్రియా)కు ఈ గౌరవం దక్కింది. పరస్పరం చాలా దూరంలో ఉన్న ఫోటాన్లు అనే రేణువులను అనుసంధానించే పద్ధతిని వారు కనుగొన్నట్లు నోబెల్‌ ఎంపిక కమిటీ రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పేర్కొంది. క్వాంటమ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌ అనేది ఉజ్వల రంగమని, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని కమిటీ సభ్యురాలు ఎవా ఓల్సన్‌ పేర్కొన్నారు. భద్రంగా సమాచారాన్ని బట్వాడా చేయడం, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సెన్సింగ్‌, క్వాంటమ్‌ నెట్‌వర్క్స్‌ రంగాల్లో ఇది ఉపయోగపడుతోందన్నారు. దీని మూలాలు క్వాంటమ్‌ మెకానిక్స్‌లో ఉన్నాయని వివరించారు. ఇది మరో ప్రపంచాన్ని ఆవిష్కరించిందని పేర్కొన్నారు. క్లాజర్‌ (79) క్వాంటమ్‌ సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. తొలిసారి దీన్ని 1960లలో ఒక ప్రయోగంలో పరీక్షించారు. ఆస్పెక్ట్‌ (75).. ఈ సిద్ధాంతాల్లో లోపాలను సరిచేశారు. క్వాంటమ్‌ టెలిపోర్టేషన్‌ అనే విధానాన్ని జైలింగర్‌ (77) ప్రదర్శించి చూపారు. ఇందులో చాలా సమర్థంగా సుదూరాలకు సమాచారాన్ని బట్వాడా చేయడానికి వీలవుతుంది. ఇందుకోసం ‘ఎన్‌టాంగిల్‌మెంట్‌’ను ఉపయోగిస్తారు. అయితే చిన్నపాటి రేణువుల విషయంలోనే ఇది సాధ్యమని జైలింగర్‌ తెలిపారు. ‘‘హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్లు ఒక వ్యక్తిని ఈ పద్ధతిలో వేరే ప్రాంతానికి తరలించడం కుదరదు’’ అని ఆయన సరదాగా పేర్కొన్నారు. తాను మొదట ప్రయోగాలు చేపట్టినప్పుడు వాటివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని భావించలేదన్నారు. అయితే ఆస్పెక్ట్‌, క్లాజర్‌, జైలింగర్‌ల పరిశోధనల వల్ల అనేక శాస్త్ర రంగాల్లో పురోభివృద్ధి సాధ్యమైంది.

తనకు నోబెల్‌ వరించిందని తెలుసుకొని ఒకింత దిగ్భ్రాంతికి గురైనట్లు జైలింగర్‌ తెలిపారు. ఆయన వియన్నా విశ్వవిద్యాయంలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ లభించొచ్చని 2010 నుంచి ఊహగానాలు ఉన్నాయి. వీరు ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని వుల్ఫ్‌ బహుమతిని గెల్చుకున్నారు. దీన్ని నోబెల్‌కు ముందు ఇచ్చే పురస్కారంగా భావిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని