అమెరికాలో మేయర్‌గా 18 ఏళ్ల కాలేజీ బుల్లోడు

అమెరికాలోని చిన్న నగరమైన ఆకన్‌సా సిటీ మేయర్‌గా 18 ఏళ్ల కళాశాల విద్యార్థి జేలెన్‌ స్మిత్‌ ఎన్నికయ్యారు.

Published : 09 Dec 2022 05:46 IST

ఎర్ల్‌ (యూఎస్‌): అమెరికాలోని చిన్న నగరమైన ఆకన్‌సా సిటీ మేయర్‌గా 18 ఏళ్ల కళాశాల విద్యార్థి జేలెన్‌ స్మిత్‌ ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా వెల్లడైన అనధికార ఫలితాల ప్రకారం.. నల్ల జాతీయుడైన జేలెన్‌ స్మిత్‌కు 235 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి నేమి మాథ్యూస్‌కు 183 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికతో స్మిత్‌ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా, ఆఫ్రికన్‌ అమెరికన్‌ మేయర్స్‌ అసోసియేషనులోనూ అందరికంటే చిన్నవాడైన సభ్యుడిగా గుర్తింపు పొందనున్నారు. ఈ అసోసియేషనులో ఇప్పటిదాకా క్లీవ్‌లాండ్‌ మేయర్‌ జస్టిన్‌ బిబ్‌ (35) అతి పిన్న వయస్కుడిగా కొనసాగుతున్నారు. స్మిత్‌ గత మే నెలలో ఎర్ల్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషను పూర్తి చేసుకొన్నారు. ప్రజా భద్రతను మెరుగుపరుస్తానని, టెనిసీ రాష్ట్రంలోని మెంఫిస్‌ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ప్రాంతంలో 1,800 మంది ప్రజలకు అందుబాటులో ఉండేలా కిరాణం దుకాణం ఏర్పాటుతోపాటు కొత్త వ్యాపారాలు అభివృద్ధి చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఆకన్‌సా స్టేట్‌ యూనివర్సిటీ విద్యార్థి అయిన స్మిత్‌ మాట్లాడుతూ.. ‘నేను వయసులో చాలా చిన్నవాణ్ని. హైస్కూలు నుంచి ఇప్పుడే బయటకు వచ్చా. అనుభవమూ లేదు. నావైపు చూస్తున్న  ప్రజలకు ఎప్పుడూ ఓ విషయం చెప్పేవాణ్ని.. జీవితంలో ఎక్కడో ఒకచోట మనం ముందడుగు వేయాలి అని’ అంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని