Israel-Hamas: యుద్ధం ఆగినా.. ఇజ్రాయెల్‌ వేట కొనసాగేనా?

వివిధ దేశాల్లో తలదాచుకుంటున్న హమాస్‌ (Israel-Hamas) ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల్ని మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

Updated : 02 Dec 2023 23:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఒక వేళ గాజాపై (Gaza) దాడులు విరమించినా.. హమాస్‌ ఉగ్రవాద సంస్థలోని కీలక నేతలను అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక కథనం వెలువరించింది. ఈ విషయంలో ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు..పూర్వపు ప్రధాని గోల్డా మెయిర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ శత్రువులను అంతం చేసేందుకు గోల్డా మెయిర్‌  ‘ఆపరేషన్‌ రేత్‌ ఆఫ్‌ గాడ్‌’ను చేపట్టారు. తాజాగా నెతన్యాహు కూడా.. వివిధ దేశాల్లో ఉన్న హమాస్‌ కీలక నేతలను ఏరివేసేలా తమ దేశ నిఘా సంస్థ మొసాద్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

నెతన్యాహు ఆదేశాల మేరకు మొసాద్‌ కూడా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్‌లో కీలక నేతలు ఎవరు? వాళ్లు ఏయే దేశాల్లో ఉంటున్నారు? తదితర వివరాలు ఇప్పటికే నెతన్యాహు దగ్గర ఉన్నట్లు అమెరికా వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. సాధారణంగా హమాస్‌లోని కీలక నేతలంతా తుర్కియే, లెబనాన్‌, ఖతార్‌ దేశాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వాళ్లను మట్టుబెట్టేందుకు ట్రాక్‌.. హంట్‌..కిల్‌.. ( అనుసరించు.. వేటాడు.. చంపు) అనే సూత్రాన్ని ఇజ్రాయెల్‌ పాటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ అనుసరించబోయే వ్యూహంపై  మొసాద్‌ మాజీ డైరెక్టర్ ఎఫ్రైమ్‌ హేలేవి ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రిక పేర్కొంది. ఇలాంటి అనాలోచిత చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని, ఇజ్రాయెల్‌ దేశాన్ని మరింత అస్థిరపరుస్తాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా హమాస్‌ లక్ష్యాలను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే.. ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని ఆయన అభిప్రాయపడినట్లు వెల్లడించింది. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా హమాస్‌ మూలాలను అంతమొందించాలను కోవడం ప్రతీకారం తీర్చుకోవడమే తప్ప.. తమ లక్ష్యాన్ని సాధించినట్లు కాదు’’ అని హేలేవి పేర్కొన్నారు.

హిట్‌ లిస్ట్‌లో ఉన్నది వీళ్లే..

ఇస్మాయిల్‌ హనియే

60 ఏళ్ల ఇస్మాయిల్‌ హనియే గతంలో పాలస్తీనా ప్రధానమంత్రిగా సేవలందించారు. 2017లో హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో అధిపతిగా ఎన్నికయ్యారు. 2006లో అతడు ప్రధానిగా ఉన్న సమయంలో విషం పూసిన లేఖను ఆయనకు పంపి..అంతమొందించేందుకు కుట్ర జరిగింది. ప్రస్తుతం హమాస్‌ కార్యకలాపాలకు దూరంగా తుర్కియే- ఖతార్‌ మధ్య ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం.

మహ్మద్‌ డెయిఫ్‌

హమాస్‌ మిలటరీ విభాగానికి మహ్మద్‌ డెయిఫ్‌ అధ్యక్షుడు. ఇతడిని అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు దాదాపు 6 సార్లు ప్రయత్నించి విఫలమైంది. అమెరికా రూపొందించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో 2015 నుంచి ఇతడి పేరు ఉంది. అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం సమయంలో బయటపడిన వాయిస్‌ మెసేజ్‌లో మాట్లాడింది ఈయనేనని ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఇతడు ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టంగా తెలియకపోయినా.. గాజా స్ట్రిప్‌లోనే ఉంటూ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది.

యహ్యా సిన్వార్‌

61 ఏళ్ల యహ్యా సిన్వార్‌.. హమాస్‌ మిలటరీ విభాగం  బ్రిగేడ్స్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2017లో గాజాలోని హమాస్‌ విభాగానికి సిన్వార్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. దాదాపు 23 ఏళ్లకుపైగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న ఇతడు.. 2011లో విడుదలయ్యాడు. ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ సైనికుడు గిలాద్‌ షలిత్‌ను అపహరించిన హమాస్‌ ఉగ్రవాదులు.. అతడిని అప్పగించాలంటే సిన్వార్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ అప్పగించింది.

ఖలేద్‌ మషల్‌

ఖలేద్‌ మషల్‌.. హమాస్‌ పొలిట్‌బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు పొలిట్‌బ్యూరో ఛైర్మన్‌గానూ వ్యవహరించాడు. ప్రస్తుతం ఇతడు ఖతార్‌లో ఉన్నట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. 1997లో జోర్డాన్‌ వెళ్లిన ఇతడిపై మొసాద్‌ ఏజెంట్లు హత్యాయత్నం చేశారు. కెనడా టూరిస్టుల వేషంలో వెళ్లి.. అతడి కళ్లల్లోకి ప్రమాదకరమైన స్ప్రే కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని కిడ్నాప్‌ చేసిన మొసాద్‌ ఏజెంట్లు రహస్య ప్రదేశంలో బంధించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ జోక్యం చేసుకోవడంతో..  ఆ సమయంలో మొసాద్‌ చీఫ్‌గా ఉన్న డానీ విరుగుడు మందుతో జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని