Suella Braverman: బ్రిటన్‌ను చిక్కుల్లో పడేసిన ‘ఆమె’ వీరభక్తి..!

భౌగోళిక రాజకీయాల్లో ఆయా దేశాల ప్రతినిధులు మాట్లాడే ప్రతి పదానికి విలువ ఉంటుంది. ఎదుటి దేశాన్ని అవమానపర్చేలా ఒక్కపదం వాడినా.. దాని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తాజాగా భారత్‌-బ్రిటన్‌ మధ్య ఇటువంటి పరిణామాలే చోటు చేసుకొన్నాయి.

Updated : 14 Oct 2022 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భౌగోళిక రాజకీయాల్లో ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు మాట్లాడే ప్రతి పదానికి విలువ ఉంటుంది. ఎదుటి దేశాన్ని అవమానపర్చేలా ఒక్కపదం వాడినా.. దాని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. తాజాగా భారత్‌-బ్రిటన్‌ మధ్య ఇటువంటి పరిణామాలే చోటు చేసుకొన్నాయి. తన దేశభక్తి ప్రదర్శించుకోవడానికి ఓ బ్రిటన్‌ మంత్రి భారత్‌పై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఇరు దేశాల మధ్య మరికొన్ని రోజుల్లో జరుగుతుందనుకొన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ వ్యాఖ్యల ఫలితంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. భారత్‌ కూడా బ్రిటన్‌ వాసులకు వీసాల జారీలో జాప్యం చేయడం మొదలుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. భారత్‌-బ్రిటన్‌ మధ్య ఆర్థికంగా చిచ్చుపెట్టేలా ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రి పేరు సుయేలా బ్రేవర్మన్‌. బ్రిటన్‌ హోంశాఖ మంత్రి.

భయంకరమైన అతివాది ఈ బ్రేవర్మన్‌..!

సుయేలా బ్రేవర్మన్‌ తల్లిదండ్రుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. తండ్రి క్రిస్టీ ఫెర్నాండో గోవా నుంచి కెన్యా వెళ్లి.. అక్కడి నుంచి యూకేలో స్థిరపడ్డారు. ఇక ఆమె తల్లి ఉమా తమిళనాడు నుంచి మారిషస్‌కు వెళ్లి.. అక్కడి నుంచి యూకే చేరుకొని నేషనల్‌ హెల్త్‌సర్వీస్‌లో నర్స్‌గా పనిచేశారు. బ్రేవర్మన్‌ న్యాయవిద్య చదివారు. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినవారిలో ఆమె కూడా ఒకరు. 
బ్రేవర్మన్‌ బ్రిటిష్‌ రాచరికంపై విపరీతమైన భక్తిని ప్రదర్శిస్తారనే పేరుంది. ‘బ్రిటన్‌ చరిత్రలో చేసిన చర్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. కెన్యా, మారిషస్‌ వంటి దేశాల్లో న్యాయవ్యవస్థ, సైన్యం, పౌరసేవలు, మౌలిక వసతులు బ్రిటిష్‌ రాచరికపు చలువే అని ఆమె ఆ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు. బ్రిటిష్‌ సామ్రజ్యంపై ప్రేమతోనే తన తల్లిదండ్రులు వలస వచ్చారని ఈ ఏడాది జూన్‌లో కన్జర్వేటీవ్‌ హోం అనే వెబ్‌సైట్‌కు ఆమె చెప్పారు. బ్రిటన్‌కు అక్రమంగా వలస వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రవాండాకు తరలించడం తన కల అని ఆమె గతంలో పేర్కొన్నారు.

భారత్‌తో వివాదం సృష్టించింది ఇలా.. 

బ్రేవర్మన్‌ ఇటీవల ది స్పెక్టేటర్‌ పత్రికతో మాట్లాడుతూ.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొంటే వలసలు భారీగా పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోతున్నారని పేర్కొన్నారు. అసలు వీసా కాలపరిమితి మించి బ్రిటన్‌లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులు అని వెల్లడించారు. భారత్‌తో ఓపెన్‌ బోర్డర్‌ మైగ్రేషన్‌ పాలసీపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌ కోసం ఓటు వేసిన ప్రజలు దీనిని కోరుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌తో చేసుకొన్న ఒప్పందం వల్ల పెద్ద ప్రయోజనం లేదని ఆమె విమర్శించారు. 

తీవ్రంగా స్పందించిన భారత్‌..

బ్రిటన్‌ హోం మంత్రి వ్యాఖ్యలు భారత్‌ను షాక్‌కు గురిచేశాయి. ఒక రకంగా అంతర్జాతీయంగా భారత్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేవిగా ఉన్నాయి. దీంతో దీపావళి సమయంలో జరగాల్సిన భారత ప్రధాని మోదీ బ్రిటన్‌ పర్యటన నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌ కూడా కీలక చర్యలు చేపట్టింది. భారత్‌ పర్యటన నిమిత్తం వీసాల కోసం దరఖాస్తు చేసుకొనే బ్రిటన్‌ వాసులు స్వయంగా వీసా కేంద్రాలకు హాజరుకావాలని పేర్కొంది. ఏజెంట్లు రాకూడదని తేల్చిచెప్పింది. బ్రేవర్మన్‌ వ్యాఖ్యలకు దీనిని ప్రతిచర్యగా భావిస్తున్నారు. 

దిద్దుబాటు చర్యలు..? 

ప్రధాని లిజ్‌ట్రస్‌ ప్రతినిధి బుధవారం బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవి బ్రిటన్‌ అధికారిక విధానాలు కావని పేర్కొన్నారు. దీపావళి నాటికి తాము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లేవర్లీ మాట్లాడుతూ.. భారత్‌తో బలమైన వ్యాపార సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత వలసదారులపై బ్రేవర్మన్‌ కామెంట్లపై క్లేవర్లీ స్పందిస్తూ.. ‘‘మేము భారత్‌తో ఇంకా బలమైన వ్యాపార భాగస్వామ్యం కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని