US shooting: ‘నేను అది చేయబోతున్నా’ అంటూ మెసేజ్‌.. పుట్టినరోజునాడే తుపాకులు కొని..

అమెరికాలోని పాఠశాలలో దాడికి పాల్పడిన నిందితుడి అదేరోజు ఉదయమే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నా దగ్గర ఓ సీక్రెట్‌ ఉంది, నీకు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ఓ యవతికి మెసేజ్‌ చేశాడు......

Published : 26 May 2022 01:15 IST

స్కూళ్లో కాల్పులకు ముందు నాయనమ్మ హత్య

టెక్సాస్‌: అమెరికా టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ 18 ఏళ్ల యువకుడు జరిపిన దాడిలో స్కూళ్లోని 19 మంది చిన్నారులతో పాటు మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు. అనంతరం పోలీసులు అతడిని మట్టుబెట్టారు. కాగా నిందితుడికి సంబంధించిన పలు విషయాలు బహిర్గతమయ్యాయి. అతడి పేరు సాల్వడార్‌ రామోస్‌ అని పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడే రోజు ఉదయమే అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నా దగ్గర ఓ సీక్రెట్‌ ఉంది, నీకు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ఓ యవతికి మెసేజ్‌ చేశాడు. ‘నేను దాన్ని చేయబోతున్నా’ అంటూ మరో మెసేజ్‌ పెట్టాడు. కాగా దానికి ఆ యువతి రిప్లై ఇస్తూ.. ‘ఏం చేయబోతున్నావ్‌’ అని అడగ్గా ‘11 గంటలకు చెబుతా’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఉదయం 9.16గంటలకు అతడి చివరి మెసేజ్‌ ఉంది. అనంతరం 11.32 గంటలకు రోబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

అయితే స్కూల్లో కాల్పులు జరిపేందుకు ముందు అతని నాయనమ్మను కూడా కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ఈ దారుణాలకు పాల్పడడానికి వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కొద్దికాలంగా నిందితుడు ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. కాల్పుల్లో వినియోగించిన తుపాకులను తన 18వ పుట్టినరోజునాడే కొనుగోలు చేసినట్లు టెక్సాస్‌ సెనేటర్‌ రోలాండ్‌ గుటిరెజ్‌ వెల్లడించారు. కొనగోలు చేసిన ఆ తుపాకుల ఫొటోలను సోషల్‌ మీడియాలో కూడా పంచుకున్నట్లు తెలిపారు.

బైడెన్‌ దిగ్భ్రాంతి

ఆసియా పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఘటన గురించి తెలియడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మారణహోమాలు జరిగేందుకు మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం?’ అని ప్రశ్నించారు. ఈ ఘటనను నిరసిస్తూ.. అమెరికాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్​ స్టేషన్స్​, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మే28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని