Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్‌ ఫిర్యాదు ఏంటో తెలుసా..?

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌ (Rishi Sunak).. తన జీవిత భాగస్వామి అక్షతా మూర్తి(Akshata Murty) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Published : 08 Aug 2022 02:14 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న రిషి సునాక్‌ (Rishi Sunak).. వరుస భేటీలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి అక్షతా మూర్తి(Akshata Murty) గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వారి తొలి పరిచయం మొదలు.. ఆమె వ్యవహార తీరు, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలను రిషి సునాక్‌ మీడియాకు వెల్లడించారు.

‘వస్తువులను చక్కగా అమర్చే అలవాటు నాది. తానేమో చిందరవందరగా పడేస్తుంది. నేను చాలా క్రమశిక్షణ ఉంటాను. తనకేమో సమయస్ఫూర్తి ఎక్కువ. ఈ విషయాలు చెబితే తాను ఇష్టపడదు. కానీ, నేను మనసులో ఉన్నమాట చెబుతున్నా. ఆమెది పూర్తిగా చక్కబెట్టే తత్వం కాదు. ప్రతిచోట దుస్తులు ఎక్కడివక్కడే, బూట్లు ఎక్కడపడితే అక్కడే.. హో గాడ్‌..’ అంటూ తన భార్య అక్షతా మూర్తి గురించి రిషి సునాక్‌ చెప్పడం మొదలు పెట్టారు.

ఇంగ్లాండ్‌లోని సౌతంప్టన్‌లో భారత సంతతికి చెందిన దంపతులకు రిషి సునాక్‌ జన్మించారు. రిషి సునాక్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోన్న సమయంలో అక్షతాతో తొలి పరిచయం ఏర్పడింది. అనంతరం 2009లో బెంగళూరులో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.. కృష్ణ (11), అనౌష్క (9). ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే వాళ్లు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్‌ నడుపుతున్నాను. అందుకే వాళ్లతో గడపడానికి చాలా సమయం దొరికేది. అలా వాళ్లతో ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించాను’ అంటూ తన కుటుంబ విషయాలను రిషి సునాక్‌ పంచుకున్నారు.

అయితే, రిషి సునాక్‌ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సతీమణి అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమయ్యింది. దీంతో అధికారిక నివాసం డౌనింగ్‌ స్ట్రీట్‌లోని నెం.10 నుంచి ఖాళీ చేసి మరోచోటికి మారిపోయారు. అనంతరం అక్షతా మూర్తి వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ప్రధానమంత్రి పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడం.. అనంతరం కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలుకావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌లు మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చివరి ఫలితం సెప్టెంబర్‌ 5న తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని