India- Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సమక్షంలో కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేసిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్‌.. కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది.

Published : 29 Apr 2024 23:47 IST

దిల్లీ: తమ దేశంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కెనడా (Canada) ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ప్రసంగిస్తుండగా.. కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని భారత్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఇక్కడి కెనడా డిప్యూటీ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.

‘‘ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేసింది. వేర్పాటువాదం, తీవ్రవాదం, హింసకు కెనడాలో లభిస్తోన్న రాజకీయ మద్దతును ఈ ఘటన మరోసారి తేటతెల్లం చేసింది. ఇటువంటి నిరంతర ఘటనలు.. ఇరుదేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా ఆ దేశ సొంత పౌరులకు హాని చేకూర్చే హింసాత్మక, నేరపూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

అతడి హత్యకు పుతిన్‌ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా

కెనడాలోని టొరంటోలో ఆదివారం ఖల్సా డే పరేడ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూలవాదులు నినాదాలు చేశారు. ‘ఖలిస్థానీ జిందాబాద్‌’ అని అరుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, కెనడా ప్రధాని వారిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను దిల్లీ తీవ్రంగా ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని