భారత్‌ ‘ఎక్స్‌ప్రెస్‌’ స్టేషన్‌ దాటేసింది.. తొందరపడండి: రిషి సునాక్‌కు నేతల సూచన

భారత్‌ తో సంబంధాలు బలోపేతం కావాలంటే బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) వీలైనంత త్వరగా దిల్లీ పర్యటనకు వెళ్లాలని యూకే నేతలు సూచిస్తున్నారు. ఇండియా.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా అభివర్ణించారు.

Updated : 21 Jan 2023 19:33 IST

లండన్‌: భారత్‌ (India), బ్రిటన్‌ (Britain) మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవి సరైన దిశలోనే ముందుకెళ్తున్నాయని యూకే సర్కారు చెబుతున్నప్పటికీ.. దీనిపై మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ అత్యంత వేగంగా దూసుకెళ్తోన్న ఆర్థిక వ్యవస్థ అని.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) వీలైనంత త్వరగా ఆ దేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు.

బ్రిటన్‌ ఎగువసభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్‌లో ‘యూకే-భారత్‌ సంబంధాల ఆవశ్యకత’పై చర్చ సందర్భంగా దక్షిణాసియా విదేశీ వ్యవహారాల మంత్రి తారిక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. యూకే (UK) విదేశాంగ విధానంలో భారత్‌తో బంధం చాలా కీలకమైందని తెలిపారు. ‘‘ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మెరుగ్గా ముందుకెళ్తున్నాయి. అతి త్వరలోనే మరో దఫా చర్చలు జరగనున్నాయి. భారత్‌తో భాగస్వామ్యం మనకు అత్యంత కీలకం. బ్రిటిష్‌ ఎగుమతిదారుల ప్రయోజనాల కోసం సుంకాలను తగ్గించుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఎన్నో కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని తారిక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎగువ సభలో మరో సభ్యుడు కరన్‌ బిలిమోరియా దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు భారత్‌ జి20 కూటమికి అధ్యక్షత వహిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే రెండో ఆర్థిక శక్తిగా ఎదిగే లక్ష్యంతో ఇప్పటి నుంచే ముందుకెళ్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఏంటంటే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌ దాటేసింది. ఆ దేశానికి యూకే మరింత దగ్గరవ్వాలి. రాబోయే దశాబ్దాలకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడు, భాగస్వామిగా మనం మారాలి. యూకే ప్రధాని వీలైనంత త్వరగా తన ప్రతినిధుల బృందంతో భారత పర్యటనకు వెళ్లాలి’’ అని రిషి సునాక్‌ సర్కారుకు సూచించారు.

భారత్‌, బ్రిటన్‌ మధ్య రక్షణ, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఎఫ్‌టీఏ (FTA) ఒప్పందం చేసుకునేందుకు గతేడాది జనవరిలో ఇరు దేశాలు నిర్ణయించాయి. 2022 దీపావళి నాటికి ఈ ఒప్పందం చేసుకోవాలని అప్పటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గడువు పెట్టుకున్నప్పటికీ అది పూర్తికాలేదు. ఈలోగా యూకేలో రాజకీయ అనిశ్చితులు, ఇతరత్రా కారణాలతో ఈ ఒప్పందంపై చర్చలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఎఫ్‌టీఏ ఒప్పందం చేసుకునేందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల ప్రధాని రిషి సునాక్‌ మరోసారి సంసిద్ధత వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని