BRI Project: చైనాకు ఇటలీ చెక్‌.. బీఆర్‌ఐ నుంచి నిష్ర్కమణకు సిద్ధం!

చైనా ఉద్దేశించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) నుంచి బయటకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఇటలీ.. చైనాకు మరోసారి సంకేతాలిచ్చింది.

Published : 11 Sep 2023 02:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివిధ దేశాల మధ్య అనుసంధాన వ్యవస్థను, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు చైనా ఉద్దేశించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)కి బీటలువారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేందుకు ఇటలీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ.. చైనాకు మరోసారి సంకేతాలిచ్చారు. భారత్‌లో నిర్వహించిన జీ20 సదస్సు క్రమంలో చైనాతో జరిపిన చర్చల సందర్భంగా ఇటలీ ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

జీ20 సదస్సులో క్రమంలో చైనా-ఇటలీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఐ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చైనా ప్రధాని లీ కియాంగ్‌కు చెప్పారు. అయినప్పటికీ బీజింగ్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం నుంచి బయటపడాలనే విషయాన్ని చైనాకు తెలియజేయడంలో ఇటలీ ప్రధాని ఆచితూచి వ్యవహరించినట్లు సమాచారం. ఒప్పందం నుంచి బయటకువస్తే తీవ్ర పరిణామాలుంటాయని చైనా రాయబారి హెచ్చరించిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం చాలా సున్నితమైంది కావడంతో.. త్వరలో ఇటలీ ప్రధాని చైనాలో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బ్రిటన్‌లో చైనీయుల గూఢచర్యం..! రిషి సునాక్‌ ఆందోళన

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)ను తెరపైకి తెచ్చారు. వివిధ దేశాల మధ్య అనుసంధాన వ్యవస్థను, ఆర్థిక సంబంధాలను, వాణిజ్యాన్ని పెంపొందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యాలని.. ఇందులో పాల్గొనే ప్రతి దేశానికి అనేక ప్రయోజనాలుంటాయని చైనా పేర్కొంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2019లో రోమ్‌ పర్యటన సందర్భంలో ఇటలీ బీఆర్‌ఐలో చేరింది. దీనిపై అమెరికా, ఐరోపా దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అయితే, ఈ ప్రాజెక్టుపై ఇటీవల అక్కడి రక్షణమంత్రి  తీవ్ర విమర్శలు గుప్పించడం.. బీఆర్‌ఐలో చేరాలని తమ దేశం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దాన్నుంచి ఇటలీ బయటపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని