Biden-Jinping: ‘మీ సతీమణి బర్త్‌డేకు గిఫ్ట్‌ తీసుకెళ్లు’.. చైనా అధినేత జిన్‌పింగ్‌కు గుర్తుచేసిన బైడెన్‌

Biden-Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన సతీమణి పుట్టినరోజును మర్చిపోయారట. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గుర్తుచేయడంతో జిన్‌పింగ్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 16 Nov 2023 16:04 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: నిత్యం బిజీగా ఉండే దేశాధినేతలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయకతప్పదు. వారు కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోవచ్చు. చైనా (China) అధినేత షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) కూడా అలాగే తన సతీమణి పుట్టినరోజును మర్చిపోయారట..! అయితే, ఆమె బర్త్‌డే గురించి అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) గుర్తుచేయడమే గాక.. ఓ బహుమతి తీసుకెళ్లాలని జిన్‌పింగ్‌కు సూచించారు.

అమెరికాలో పర్యటిస్తున్న షీ జిన్‌పింగ్‌.. అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌తో ముఖాముఖీగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో దేశాధినేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. నవంబరు 20న బైడెన్‌ తన 81వ పుట్టినరోజును చేసుకోనున్నారు. అదే రోజున జిన్‌పింగ్‌ సతీమణి పెంగ్‌ లియువాన్‌ (Peng Liyuan) పుట్టిన రోజు కూడా..!

తాజాగా జరిగిన సమావేశంలో బైడెన్‌ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. పెంగ్‌కు తన తరఫున శుభాకాంక్షలు తెలపాలని జిన్‌పింగ్‌కు చెప్పారు. అయితే, సతీమణి పుట్టినరోజును మర్చిపోయిన జిన్‌పింగ్‌ ఆ క్షణంలో ఒకింత ఇబ్బందికి గురయ్యారట. ‘‘ఈ బాధ్యతల్లో పడి నేను ఆ తేదీనే మర్చిపోయా. ఆమె పుట్టిన రోజును గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు. ఆమె కోసం ఏదైనా తీసుకెళ్లేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తా’’ అని జిన్‌పింగ్‌ చెప్పినట్లు యూఎస్‌ అధికారులు వెల్లడించారు.

‘ఆయన నియంతే..’: జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత బైడెన్‌ మళ్లీ అదే మాట..!

అటు సమావేశం తర్వాత బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘జిన్‌పింగ్‌తో నా బంధం చాలా లోతైనది. ప్రపంచంలోని ఇతర నేతలకంటే చైనా అధ్యక్షుడితోనే నేను ఎక్కువ సమయం గడిపా. మా దేశాలకు ఉపాధ్యక్షులుగా ఉన్ననాటి నుంచే మేం సమావేశాల్లో పాల్గొన్నాం. ఆయన కార్యనిర్వహణ శైలి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయనకు ఓ బర్త్‌డే కార్డు (పెంగ్‌ పుట్టినరోజును ఉద్దేశహస్తూ) కొనాలని గుర్తుచేశా’’ అని బైడెన్‌ తెలిపారు.

షీ జిన్‌పింగ్‌కు తొలుత కె లింగ్‌లింగ్‌తో వివాహమైంది. అయితే కొన్ని కారణాలతో వారు 1982లో విడిపోయారు. ఆ తర్వాత 
ప్రముఖ జానపద గాయని అయిన పెంగ్‌ లియువాన్‌ను 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమార్తె ఉంది. చైనా గత అధ్యక్షుల సతీమణులతో పోలిస్తే.. దేశ ప్రథమ మహిళగా పెంగ్‌ అనేక సార్లు మీడియాలో కన్పించారు. 2014లో అప్పటి అమెరికా ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా బీజింగ్‌ పర్యటనకు వచ్చినప్పుడు.. ఆమెకు పెంగ్‌ ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని