ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌ మాయం..ఎయిర్‌టాగ్‌తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు

అమెరికాలోని ఓ వ్యక్తికి చెందిన లగేజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో మాయమైంది. చోరీకి గురైందని గుర్తించిన ప్రయాణికుడు బ్యాగులో ఎయిర్‌ టాగ్‌ ఉండటంతో నిందితుడిని ట్రాక్‌ చేసి తన లగేజ్‌ను తిరిగి పొందాడు.

Published : 31 Mar 2023 19:13 IST

వాషింగ్టన్‌: విమానశ్రయంలో ఒకవేళ లగేజ్‌ మాయమైతే దానిపై ఫిర్యాదు చేసి సామానును తిరిగి పొందడానికి కొన్నిరోజులు పడుతుంది. లగేజ్‌ తిరిగి పొందినా అందులో అన్ని వస్తువులు ఉండే అవకాశం లేదు. అయితే ఓ వ్యక్తి తన తెలివితేటలు ప్రదర్శించి గంటల వ్యవధిలోనే ఓ దొంగతనాన్ని ఛేదించాడు. విమానాశ్రయంలో చోరీకి గురైన తన లగేజ్‌ను తిరిగి పొందాడు. నిందితుడిని పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాధితుడి కథనం ప్రకారం..

అమెరికా(United States)కు చెందిన జమీల్‌ రీడ్‌ అనే వ్యక్తి లాస్‌ ఏంజెల్స్‌ (Los Angeles) నుంచి జార్జియాలోని అట్లాంటా (Atlanta)కు ప్రయాణించడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాడు. బ్యాగేజ్‌ కార్సెల్‌పై చూడగా అతడి బ్యాగ్ కనిపించలేదు. తన బ్యాగు చోరీకి గురైందని గుర్తించాడు. తన బ్యాగులో ఎయిర్‌టాగ్‌ ఉండటంతో లగేజ్‌ను ట్రాక్‌ చేస్తూ దాని కదలికలను గమనించాడు. నిందితుడు తిరిగి ఎయిర్‌పోర్టుకు వస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వారి సమక్షంలో నెల్సన్‌ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాడు. అయితే నెల్సన్‌ తన దుస్తులే(టీషర్ట్‌, జీన్స్‌) ధరించడాన్ని చూసి జమీల్‌ కంగుతిన్నాడు. ఆ లగేజ్‌ తనదేనని తొలుత నెల్సన్‌ పోలీసుల ముందు బుకాయించిన అతడు జమీల్‌ దుస్తులు ధరించడంతో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులో సుమారు 3,000 డాలర్ల(రూ. 2.4 లక్షలు) విలువైన వస్తువులున్నాయని బాధితుడు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని