Ukraine Crisis: రష్యా బలగాల కదలిక అంతంతమాత్రమే.. నాటో డిప్యూటీ చీఫ్‌

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాల పురోగమనం క్షీణిస్తున్నట్లు కనిపిస్తోందని నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ మిర్సియా జియోనా అన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు...

Published : 16 May 2022 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాల పురోగమనం క్షీణిస్తున్నట్లు కనిపిస్తోందని నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ మిర్సియా జియోనా అన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌కు మరింత మద్దతు అందించడం, నాటో కూటమిలో చేరికపై ఫిన్లాండ్, స్వీడన్, ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు నాటో అగ్ర దౌత్యవేత్తలు ఆదివారం బెర్లిన్‌లో సమావేశం కానున్నారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో.. జియోనా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

ఈ సందర్భంగా జియోనా మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ భూభాగంపై రష్యా క్రూరమైన దండయాత్ర పురోగతి కోల్పోతోందని తెలిపారు. ఉక్రెయిన్‌ పౌరులు, సైన్యం ధైర్యసాహసాలకు పశ్చిమ దేశాల సహకారం తోడవడంతో.. కీవ్‌ ఈ యుద్ధంలో విజయం సాధించగలదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ మద్దతుదారులు ఐకమత్యంగా ఉన్నారని.. విజయం సాధించేవరకు ఆ దేశానికి సాయం చేస్తూనే ఉంటారని చెప్పారు. నాటోలో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చేరిక విషయమై మాట్లాడుతూ.. ‘ఈ రెండు దేశాలు ఇప్పటికే నాటోకు సన్నిహిత భాగస్వాములుగా ఉన్నాయి. మా మిత్రదేశాలు సైతం వారి దరఖాస్తులను సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్న’ట్లు చెప్పారు. త్వరలో స్పెయిన్‌లో నిర్వహించనున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి జార్జియా అధికారులనూ ఆహ్వానించనున్నట్లు తెలిపారు. నాటో కూటమి ఓపెన్- డోర్ విధానం పవిత్రమైనదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని