Corona Virus: ఈ నెలాఖరు నాటికి బీజింగ్‌లో అందరికీ కరోనా!

చైనా రాజధాని బీజింగ్‌లో నివసిస్తున్న వారిలో ఈ నెల చివరినాటికి దాదాపు అందరికీ కరోనా వైరస్‌ సోకే అవకాశముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 15 Jan 2023 01:24 IST

బీజింగ్‌: పొరుగు దేశం చైనా (China) లో కరోనా మహమ్మారి (Corona Virus) అర్రులు చాస్తోంది. వైరస్‌ మరోసారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఈ నెల చివరి నాటికి ఆ దేశ రాజధాని బీజింగ్‌ (Beijing)లోని మొత్తం 2 కోట్ల మంది ప్రజలకు వైరస్‌ సోకే అవకాశముందని తాజా అధ్యయనం (Study) లో వెల్లడైంది. గత డిసెంబరు 22 నాటికి నగరంలో దాదాపు 76 శాతం మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ‘నేచర్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చైనా గత నవంబరులో కొంతమేర ఆంక్షలను సడలించింది. అంతేకాకుండా డిసెంబరులో జీరో కొవిడ్‌ విధానం అమలును పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాకుండా వైరస్‌ రీప్రొడక్టివ్‌ రేటు 3.44కి పెరిగినట్లు అధ్యయం పేర్కొంది. అంటే కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 3.44 మందికి ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

వైరస్‌తో కలిసి జీవించాలంటూ డిసెంబరులో చైనా ప్రభుత్వం పిలుపునిస్తూ.. జీరో కొవిడ్‌ పాలసీ అమలును నిలిపి వేసింది. దీంతో కొవిడ్‌ వ్యాప్తి రేటు పెరిగిపోయింది. అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన వాళ్లంతా రోడ్లమీదకు రావడంతో వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందింది. కరోనా తొలినాళ్లను గుర్తు చేసేలా ఆస్పత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. శ్మశానవాటికలు శవాలతో నిండిపోతున్నాయి. మరోవైపు జనవరి 11 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మందికి  కరోనా వైరస్‌ సోకటినట్లు అక్కడి పెకింగ్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన 141 కోట్ల జనాభాలో 64 శాతం మందికి మహమ్మారి సోకినట్లు చెప్పవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని