Nikki Haley: బైడెన్‌కు ఓటేస్తే.. కమలా హ్యారీస్‌పై ఆధారపడుతున్నట్లే..!

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ (Joe Biden) మరోసారి ఎన్నికైతే.. ఆయన పదవి పూర్తయ్యే సరికి ఆ పదవిలో కొనసాగే అవకాశాలు లేకపోవచ్చని రిపబ్లికన్‌ నేత నిక్కీ హేలీ (Nikki Haley) పేర్కొన్నారు.

Published : 29 Apr 2023 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీలో ఉండనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రిపబ్లికన్‌ నేత నిక్కీ హేలీ (Nikki Haley) ఘాటుగా స్పందించారు. జో బైడెన్‌ వయసును ప్రస్తావించిన ఆమె.. 86ఏళ్ల వయసు వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగడం కష్టంగా కనిపిస్తుందన్నారు. ఆయనకు ఓటేస్తే కమలా హ్యారీస్‌పై ఆధారపడినట్లే అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపబ్లికన్‌ తరఫున అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న నిక్కీ హేలీ ఈ విధంగా మాట్లాడారు.

‘మనందరికీ ఒక విషయం స్పష్టంగా తెలుసు. మీరు నిజంగా బైడెన్‌కు ఓటేస్తే.. అధ్యక్షురాలు కమలా హ్యారీస్‌పై ఆధారపడుతున్నట్లే. ఎందుకంటే, 86ఏళ్ల వయసులో ఆయన ఆ పదవిలో ఉంటారని నేను అనుకోవడం లేదు’ అని నిక్కీ హేలీ పేర్కొన్నారు. బైడెన్‌ రెండోసారి ఎన్నికైనప్పటికీ ఆయన పదవీకాలం పూర్తయ్యేవరకు అందులో కొనసాగే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బైడెన్‌ వయసు 81ఏళ్లు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలిస్తే.. ఆయన పదవికాలం ముగిసే 2028 నాటికి బైడెన్‌ వయసు 86 అవుతుంది. ఈ క్రమంలోనే నిక్కీహేలీ పైవిధంగా స్పందించారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగుతున్న అత్యంత వృద్ధ నేతగా జో బైడెన్‌ కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైట్‌హౌస్‌ వైద్యుల నివేదిక చెబుతోంది.

ఇలా అమెరికా అధ్యక్ష పదవిలో వృద్ధ నేతలు కొనసాగడంపై భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (51) మొదటినుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 75ఏళ్ల వయసు దాటిన నేతలకు మానసిన సామర్థ్య పరీక్షలు చేయించాలని గతంలో ఆమె పిలుపునిచ్చారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వయసుపైనా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ట్రంప్‌ వయసు 76ఏళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని