Prigozhin: ప్రిగోజిన్‌ మృతి వెనక పుతిన్ సన్నిహితుడు..!

వాగ్నర్ బాస్ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) మృతికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) సన్నిహితుడు ప్రణాళిక రచించారంటూ పాశ్చాత్య మీడియా ప్రచురించిన కథనంపై రష్యా(Russia) స్పందించింది. అవన్నీ కల్పిత కథలని కొట్టిపారేసింది.

Updated : 23 Dec 2023 16:52 IST

 

మాస్కో: రష్యా(Russia) సైనిక బాస్‌లపై తిరుగుబాటు చేసి, చివరకు అనుమానాస్పదంగా మృతి చెందారు వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్ ప్రిగోజిన్‌(Yevgeny Prigozhin). ఆయన మృతికి అధ్యక్షుడు పుతిన్‌(Putin) సన్నిహితుడైన నికొలాయ్‌ పత్రుషెవ్‌ ప్రణాళిక రచించాడట. ఈ మేరకు పాశ్చాత్య మీడియా సంస్థ వెల్లడించింది. ఈ కథనాలపై రష్యా మండిపడింది. అవన్నీ కల్పితకథనాలని తోసిపుచ్చింది.

విమానం రెక్క కింద బాంబు పెట్టి ప్రిగోజిన్‌(Yevgeny Prigozhin) ప్రైవేటు విమానం కూల్చివేశారని ఆ కథనం పేర్కొంది. రష్యా మాజీ నిఘా అధికారిని ఉటంకిస్తూ ఈ విషయం వెల్లడించింది. ఈ ఘటనకు రష్యా సెక్యూరిటీ అధికారి నికొలాయ్‌ పత్రుషెవ్‌ ప్రణాళిక రచించాడని పేర్కొంది. పుతిన్‌ అధ్యక్షుడిగా తన ప్రయాణం మొదలు పెట్టిన దగ్గరి నుంచి నికొలాయ్‌ ఆయన వద్దే సేవలు అందిస్తున్నారు. శక్తివంతమైన నేతగా చలామణీ అవుతున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన తర్వాత.. అతడిని మట్టుపెట్టాలని నికొలాయ్‌ నిర్ణయించారని, దానికి పుతిన్‌(Putin) అడ్డుచెప్పలేదని తెలిపింది. ఈ కథనాలను క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తోసిపుచ్చారు. ‘ఆ కథనాలు నా కంటపడ్డాయి. దురదృష్టవశాత్తు సదరు మీడియా సంస్థ కల్పిత కథలను వండివార్చేందుకు ఎక్కడలేని ఆసక్తి చూపించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రష్యా దళాలపై ‘మౌస్‌ ఫీవర్‌’ ప్రభావం’

కిరాయి సైన్యంగా పేర్కొందిన వాగ్నర్‌ గ్రూప్‌నకు ప్రిగోజిన్‌(Yevgeny Prigozhin) నాయకత్వం వహించారు. కొద్ది నెలల క్రితం రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి ప్రిగోజిన్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వెంటనే తిరుగుబాటు నుంచి వెనక్కి తగ్గి, బెలారస్‌లో ఆశ్రయం పొందారు. పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో అప్పట్లో వెల్లడించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని