Kim Jong un: కిమ్‌ కుమార్తె.. దేశంలో ఆమె పేరు ఎవరికీ ఉండొద్దట!

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ పదేళ్ల కుమార్తె ‘జు-యే’నే ఆయన తదుపరి వారసురాలనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ‘జు-యే’ పేరుగల వారందరూ వెంటనే మార్చుకోవాలని అధికారులు స్థానికులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Published : 13 Feb 2023 01:24 IST

ప్యోంగ్యాంగ్‌: ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్ జోంగ్‌ ఉన్‌(Kim Jong-Un) పదేళ్ల కుమార్తె ‘జు-యే(Ju-ae)’నే కిమ్‌ వారసురాలనే వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆమెను పదేపదే బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం, స్థానిక మీడియా ఆమెను గౌరవనీయమైన కుమార్తె అంటూ ప్రస్తావించడం.. ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశవ్యాప్తంగా ‘జు-యే’ పేరు ఉన్నవారంతా తమ పేరును మార్చుకోవాలని అధికారులు బలవంతం చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కిమ్‌ కుమార్తెకు అదే పేరు ఉన్న నేపథ్యంలో.. పౌరులు ఆ పేరును వాడటాన్ని నిషేధించేందుకు అధికారులు ఈ మేరకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

దీంతో స్థానిక అధికారులు ‘జు-యే’ పేరుగల మహిళల కోసం జల్లెడ పడుతున్నారని, పేరు మార్చుకోవాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారని ‘రేడియో ఫ్రీ ఏషియా’ వార్తాసంస్థ తెలిపింది. ఉత్తర ప్యోంగాన్‌ ప్రావిన్స్‌లోని చోంగ్జు భద్రతా విభాగం.. ఆ పేరు ఉన్నవారిని పిలిపించి, వారి పేర్లను మార్చుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. దక్షిణ ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని ప్యోంగ్‌సాంగ్ అధికారులు సైతం ఇదే విధంగా సూచించినట్లు వెల్లడించింది. తమ నాయకులను గౌరవించేలా.. వారి పేర్లను ప్రజలు ఉపయోగించకుండా ఉత్తర కొరియా చట్టాలుంటాయి. కిమ్ ఇల్- సంగ్ కాలం నాటినుంచి ఇది ఉంది. కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన పేరుతోపాటు ఆయన భార్య ‘సోల్-జు’ పేరును పౌరులు కలిగి ఉండటాన్ని కట్టడి చేసింది.

ఇదిలా ఉండగా.. కిమ్ మొదటిసారి గతేడాది తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ICBM) ప్రయోగస్థలం వద్దకు ఆమెను వెంట తీసుకువచ్చారు. తాజాగా మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజధాని నగరం ప్యోంగ్యాంగ్‌లో ఐసీబీఎంలు, ఇతర ఆయుధాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికీ కిమ్ తన కుమార్తెను తీసుకొచ్చారు. దీంతో కలిపి మూడు నెలల వ్యవధిలో ఆమె ఐదుసార్లు బయట కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని