Pakistan: అమెరికాతో దోస్తీ నష్టమే.. పాక్‌ మంత్రుల సంభాషణ లీక్‌..!

పాక్‌ ప్రధాని, విదేశాంగశాఖ జూనియర్‌ మంత్రికి మధ్య జరిగిన కీలక సంభాషణలు అమెరికా చేతిలో ఉన్నాయి. ఆ విషయాన్ని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నిన్న కథనంలో పేర్కొంది. 

Published : 01 May 2023 14:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA) నిఘా నేత్రం పాకిస్థాన్‌(Pakistan)పై ఏ స్థాయిలో ఉందో తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌( Shehbaz Sharif), విదేశాంగశాఖ జూనియర్‌ మంత్రి హీనా రబ్బానీ (Hina Rabbani )మధ్య జరిగిన సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరించాయి. దీనికి సంబంధించిన పత్రాలు.. డిస్కార్డ్‌ మెసేజింగ్‌ యాప్‌లో బహిర్గతం అయ్యాయి. ఈ పత్రాల వివరాలను ఆదివారం వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ప్రచురించింది.

పశ్చిమ దేశాలను సంతృప్తి పర్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడాన్ని మానుకోవాలని ప్రధానికి హీనా రబ్బానీ సూచించినట్లు ఆ పత్రంలో ఉంది. చైనా, అమెరికా విషయంలో మధ్యస్తంగా ఉండేందుకు భవిష్యత్తులో ప్రయత్నాలు చేయలేమని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. గతంలో పాక్‌-అమెరికాల మధ్య మిత్రత్వం కారణంగా చైనాతో వ్యూహాత్మక బంధంతో లభించే ప్రయోజనాలను త్యాగం చేయాల్సి వచ్చిందని హీనా దానిలో వాదించారు. ఎలాంటి తేదీని పేర్కొనకుండా ఉన్న ఈ పత్రాలు అమెరికా చేతికి ఎలా వచ్చాయో తెలియడం లేదు.

ఫిబ్రవరి 17వ తేదీతో ఉన్న మరో పత్రంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ ఐరాసలో పాక్‌ విధానంపై తన వద్ద పనిచేసే అధికారికి చేసిన సూచనలున్నాయి. ఆ తర్వాత ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌పై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉన్న 32 దేశాల్లో పాక్‌ కూడా ఒకటి. ఇటీవలే పాక్‌-రష్యా మధ్య చమురుపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ పత్రాల లీక్‌పై వాషింగ్టన్‌ పోస్టులో కథనం ప్రచురితం కావడం గమనార్హం.

2010లో వికీలీక్స్‌ తర్వాత అమెరికాలో జరిగిన అతిపెద్ద లీక్‌గా ఇటీవల డిస్కార్డ్‌ యాప్‌లో దర్శనమిచ్చిన పత్రాలు నిలిచాయి. అమెరికా రహస్య పత్రాలు తొలిసారి మార్చి 1వ తేదీన ‘డిస్కార్డ్‌’ అనే సోషల్‌ మీడియా వేదికపై కనిపించాయి. ఆ తర్వాత వీటి సంఖ్య మరింత పెరిగింది. డిస్కార్డ్‌ను ఎక్కువగా వీడియో గేమర్లు చాట్‌ రూమ్‌ల కోసం వినియోగిస్తుంటారు. మైన్‌క్రాఫ్ట్‌ గేమ్‌, ఉక్రెయిన్‌ యుద్ధంపై చిన్న వాదన జరిగిన సమయంలో ఓ యూజర్‌ ఇక్కడ కొన్ని లీకైన పత్రాలున్నాయి అని పేర్కొని.. పెద్ద సంఖ్యలో స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేశాడు. లీక్‌ చేసిన వ్యక్తిని అమెరికా ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌ జాక్‌ టెయిక్సిరా అనే యువకుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని