Modi France Visit: ఫ్రాన్స్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. రెడ్‌ కార్పెట్‌ స్వాగతం

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బార్న్‌.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

Published : 13 Jul 2023 17:31 IST

పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్‌ (France)కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు పారిస్‌ (Paris) విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి.. రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బార్న్‌ ప్రధాని మోదీని రిసీవ్‌ చేసుకున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ తాను ఫ్రాన్స్‌కు చేరుకున్నట్లు ట్వీట్‌ చేశారు. స్వాగత కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత్- ఫ్రాన్స్‌ల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన వేళ మోదీ ఈ పర్యటన చేపడుతున్నారు.

ప్రధాని మోదీ తొలుత ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో సమావేశమవుతారు. అనంతరం సెనేట్‌ను సందర్శించి.. సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో.. ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత.. ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ విందులో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ.. ఆ దేశ ‘నేషనల్‌ డే’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. పారిస్‌లో శుక్రవారం జరగనున్న నేషనల్‌ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఇందులో భారత త్రివిధ దళాలూ భాగస్వామ్యం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని