Joe Biden: ఊపిరి పీల్చుకునేందుకే రష్యా బ్రేక్‌ : బైడెన్‌

ఉక్రెయిన్‌పై జరుపుతోన్న దాడికి రష్యా తాత్కాలిక విరామం ఇచ్చింది. మరింత ఉద్ధృతంగా దాడి జరిపే ఎత్తుగడలో ఇది భాగమని అమెరికా, ఉక్రెయిన్ భావిస్తున్నాయి. 

Published : 06 Jan 2023 11:41 IST

వాషింగ్టన్‌: రష్యా(Russia)లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో దేశాధ్యక్షుడు పుతిన్‌(Putin) చేసిన కీలక ప్రకటనపై అమెరికా(US), ఉక్రెయిన్‌(Ukraine) అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది మరింత పుంజుకొని దాడి చేసే ఎత్తుగడ అని వ్యాఖ్యానిస్తున్నాయి. 

‘ఆసుపత్రులు, నర్సరీలు, చర్చిలపై దాడులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాస్త ఊపిరి పీల్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బ్రేక్‌ ఇచ్చారని నేను భావిస్తున్నాను’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పందించారు. అలాగే దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్( Ned Price) మాట్లాడుతూ..‘ఆయన ప్రకటనల ఉద్దేశాలపై మాకు ఎలాంటి నమ్మకం లేదు. మళ్లీ పుంజుకొని, దాడి చేయడానికి ప్రయత్నించవచ్చు. పుతిన్‌ శాంతిని కోరుకున్నట్లు నటించడం ద్వారా ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇది యుద్ధం గతిని మార్చేలా ఏమి కనిపించట్లేదు. రష్యా నిజంగా శాంతిని కోరుకున్నట్లయితే.. ఉక్రెయిన్‌ సార్వభౌమ ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలి’ అని అన్నారు.

సుమారు 11 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి పుతిన్‌ తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ నెల 7న రష్యా సంప్రదాయ (ఆర్థోడాక్స్‌) క్రిస్మస్‌ సెలవు దినం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వారాంతపు కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. మాస్కోకు చెందిన సైనిక దళాలు వచ్చే 36 గంటల పాటు ఎటువంటి కాల్పులకు పాల్పడవద్దంటూ  పుతిన్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు కాల్పుల విరమణకు రష్యాకు చెందిన ఆర్థోడాక్స్‌ చర్చి అధిపతి పాట్రియార్క్‌ కిరిల్‌ ప్రతిపాదించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం అర్ధరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) వరకూ ఈ వెసులుబాటు ఇవ్వాలని సూచించారు. అయితే దీనిని ఓ ప్రచార ఎత్తుగడగా అభివర్ణిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయ అధికారులు తేలిగ్గా తీసిపారేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని