Ukraine Crisis: గూఢచారులను వేటాడుతోన్న పుతిన్‌..!

ఉక్రెయిన్‌ పోరు జఠిలం అయ్యే కొద్దీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరింత మొండిగా మారుతున్నారు. ఇటీవల సిరియా విధ్వంసకుడు అలెగ్జాండర్‌ దివొర్నికొవ్ ఆపరేషన్‌ బాధ్యతలు అప్పజెప్పగా..

Published : 13 Apr 2022 01:11 IST

 విదేశీ నిఘా విభాగం కీలక అధికారి అరెస్ట్‌..?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

యుద్ధంలో సమాచారం అత్యంత బలమైన ఆయుధం. ప్రత్యర్థి సమాచారం ముందుగా తెలుసుకొన్న వారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. గూఢచారిగా పనిచేసిన పుతిన్‌కు ఈ విషయం బాగా తెలుసు. ఉక్రెయిన్‌లో రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని.. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు చేపట్టారు.

ఉక్రెయిన్‌ పోరు జఠిలం అయ్యే కొద్దీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరింత మొండిగా మారుతున్నారు. ఇటీవల సిరియా విధ్వంసకుడు అలెగ్జాండర్‌ దివొర్నికొవ్‌కు ఆపరేషన్‌ బాధ్యతలు అప్పజెప్పగా.. ఇప్పుడు విదేశీ గూఢచర్య విభాగం కీలక అధికారిని నిర్బంధంలోకి తీసుకొన్నారు.  రాత్రికి రాత్రే డజన్ల కొద్దీ అధికారులపై చర్యలు తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అరెస్టైన వారి సంఖ్య దాదాపు 150 వరకు ఉంటుందని అంచనా.

మాస్కోలో ఏం జరుగుతోంది..?

రష్యా గూఢచర్య వర్గాల్లో విదేశీ వ్యవహారాలను చక్కబెట్టే ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ విభాగానికి చెందిన ఫిఫ్త్‌ సర్వీస్‌ చీఫ్‌ కర్నల్‌ జనరల్‌ సెర్గీ బెసెడాను అధికారులు అదుపులోకి తీసుకొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆక్రమణ మొదలు పెట్టడానికంటే ముందే పశ్చిమ దేశాల నిఘా వర్గాలు రష్యా వ్యూహాలను పసిగట్టడంపై క్రెమ్లిన్‌ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో సెర్గీ బెసెడాను మారుపేరుతో మాస్కోలోని అత్యంత కట్టుదిట్టమైన లెఫొర్టోవ్‌ జైలుకు తరలించింది. ఆయన మార్చి నుంచి హౌస్‌ అరెస్టులో ఉన్నారు. ఓ అపహరణ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన్ను ఆధీనంలోకి తీసుకొన్నట్లు అధికారికంగా వెల్లడించారు. 

రష్యన్ల ప్లాన్ల లీకుల దర్యాప్తును సైన్యంలోనే కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కు పుతిన్‌ అప్పగించారు. పశ్చిమ దేశాలకు  సమాచారం వెళ్లకుండా ఆపాలని ఆయన ఆ సర్వీసును కోరారు.  దీంతో డజన్ల కొద్దీ ఎఫ్‌ఎస్‌బీ అధికారులను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకొన్నారు. ‘యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లోని వాస్తవిక పరిస్థితిని చెప్పకుండా..  క్రెమ్లిన్‌కు తప్పుడు సమాచారం అందించినందుకు’ ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. రష్యన్లను ఉక్రెయిన్‌ వాసులు ‘విమోచకులుగా భావించి స్వాగతం పలుకుతారు’ అని వారు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. దీంతో తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలుపెట్టిన రష్యా.. భారీగా దెబ్బతింది.

బ్రిటన్‌ రక్షణశాఖ చేతికి రష్యా సైనిక ప్రణాళికలు..

ఫిబ్రవరి నెలలో మరికొన్ని గంటల్లో రష్యా ట్యాంకులు దాడి మొదలు పెడతాయనగా.. పుతిన్‌ యుద్ధ ప్రణాళికలను మ్యాప్‌లతో సహా బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ ట్విటర్లో ఉంచింది. వీటిల్లో రష్యా సాయుధ వాహనాలు వచ్చే మార్గాలను స్పష్టంగా వెల్లడించింది. నాటి నుంచి రష్యా ఏం చర్యలు తీసుకోబోతోందో అత్యంత కచ్చితత్వంతో అమెరికా, యూకే ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిరంతరం బహిర్గతం చేస్తూ వచ్చాయి. అంతేకాదు.. రష్యా జనరల్స్‌ మరణాలను కూడా చాలా కచ్చితంగా చెప్పగలిగాయి. దీంతో రష్యా సైన్యాలు ఘోరంగా ఎదురుదెబ్బలు తిన్నాయి. ఈ కారణంగా.. పుతిన్‌ రంగంలోకి దిగి బాధ్యులుగా భావిస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టారు. అంతేకాదు.. కనీసం డాన్‌బాస్‌ ప్రాంతంలో విజయం సాధించి అయినా పరువు కాపాడుకోవాలని రష్యా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంపై రష్యా గురిపెట్టింది. దీంతో ఇక్కడ మేరియుపోల్‌ నగరాన్ని కాపాడుకోవడం ఉక్రెయిన్‌కు కీలకంగా మారింది.

పుతిన్‌ సృష్టించిన డిపార్ట్‌మెంటే..

తాజాగా చర్యలు తీసుకొన్న ఎఫ్‌ఎస్‌బీ ఫిప్త్‌ సర్వీస్‌ను పుతినే స్థాపించారు. ఆయన 1998లో ఎఫ్‌ఎస్‌బీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు దీనికి బీజాలు వేశారు. ఈ విభాగం విదేశీ జాతీయులను నియమించుకొని మాజీ సోవియట్‌ దేశాల్లో గూఢచర్యం నిర్వహంచేందుకు పనిచేసేది. గత ఇరవై ఏళ్లలో ఈ ఫిఫ్త్‌ సర్వీస్‌ విభాగం అత్యంత బలోపేతం అయింది. మాజీ సోవియట్‌ దేశాలు రష్యా పట్టు నుంచి జారిపోకుండా చూసుకొనేందుకు పుతిన్‌ దీనిని ఆయుధంగా వాడారు.  బెసెడా అత్యంత సన్నిహితుడు కావడంతో పుతిన్‌ దీని బాధ్యతలను అప్పగించారు.  

ఎవరీ సెర్గీ బెసెడా..?

రష్యాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లో బెసెడా కెరీర్‌ను ప్రారంభించారు. ఈ విభాగానికి ఎఫ్‌ఎస్‌బీలో అత్యున్నత దళంగా పేరుంది. అక్కడి నుంచి అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఆపరేషన్లను భగ్నం చేసే విభాగ చీఫ్‌ వెలంటైన్‌ క్లిమెంకోకు ఆయన్ను డిప్యూటీగా నియమించారు. వెలంటైన్‌కు సీఐఏతో సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత ఫిఫ్త్‌ సర్వీస్‌కు బదిలీ చేసి బాధ్యతలు అప్పగించారు. ఆయన పరిధిలోని ఆఫీసర్లు అబ్ఖాజియా, మాల్డోవా,ఉక్రెయిన్‌లో తరచూ పట్టుబడేవారు. ఉక్రెయిన్‌లోని మైదాన్‌ విప్లవ సమయంలో బెసెడా స్వయంగా అక్కడే ఉన్న విషయం బయటపడింది. అయినా, పుతిన్‌ అతన్ని తన సన్నిహితుల జాబితాలో కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్‌లో వైఫల్యాలకు బాధ్యుడిని చేసి శిక్షించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. బెసెడా విభాగానికి కూడా సీఐఏతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ అమెరికన్లతో సంబంధాలు ఉన్న విభాగాల ఉద్యోగుల్లో సమాచారాన్ని లీక్‌ చేసిన వారికోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మాస్కోటైమ్స్‌ కథనంలో పేర్కొంది.  2016లో అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అంశం బహిర్గతం కావడంతో.. నాటి ఎఫ్‌ఎస్‌బీ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ సెంటర్‌ అధిపతి సెర్గీ మిఖాయిలోవ్‌ను తొలగించారు. ఈ సెంటర్‌ మాత్రమే సైబర్‌ అంశాలపై అమెరికన్లతో అధికారికంగా సమాచారం పంచుకోవడానికి అనుమతులు ఉన్నాయి. అప్పట్లో ఆయన్ను కూడా లెఫొర్టోవ్‌ జైలుకు తరలించారు. 

స్టాలిన్‌ చీకటి రాజ్యం లెఫెర్టోవ్‌..

ఫిఫ్త్‌ సర్వీస్‌ చీఫ్‌ సెర్గీ బెసెడాను తరలించిన లెఫెర్టోవ్‌ జైలుకు చాలా చీకటి చరిత్ర ఉంది. 1930-40 మధ్యలో నాటి సోవియట్‌ నియంత స్టాలిన్‌ ప్రత్యర్థులను బంధించి.. హతమార్చడానికి వాడేవారు. రష్యా నిఘా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ మాత్రమే ఈజైలును నిర్వహిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ పురాతన షూటింగ్‌ రేంజి ఉంది. గతంలో స్టాలిన్‌ ప్రత్యర్థులను ఇక్కడే సామూహికంగా హతమార్చేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని