Contact lense: కాంటాక్ట్‌ లెన్సుల నుంచి సూక్ష్మప్లాస్టిక్‌ల విడుదల

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కాంటాక్ట్‌ లెన్సులు ధరిస్తారు. వీటిలో పునర్‌వినియోగ అద్దాలూ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్‌ లెన్సులు దీర్ఘకాలం పనిచేయవు. వాటిని మారుస్తూ ఉండాలి.

Published : 18 Jun 2023 00:00 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కాంటాక్ట్‌ లెన్సులు ధరిస్తారు. వీటిలో పునర్‌వినియోగ అద్దాలూ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్‌ లెన్సులు దీర్ఘకాలం పనిచేయవు. వాటిని మారుస్తూ ఉండాలి. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని తాజా పరిశోధనలో తేల్చింది. ఈ లెన్సుల నమూనాల్లోని సూక్ష్మప్లాస్టిక్‌ శకలాలను విశ్లేషించే ఒక విధానాన్ని కనుగొన్నారు. వాడేసిన కాంటాక్ట్‌ లెన్స్‌లు సూర్యకాంతికి ఎక్కువకాలం గురైతే సూక్ష్మ ప్లాస్టిక్‌ పోగులను వెదజల్లుతాయని తేల్చారు. అయితే ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి స్పష్టతలేదు. 

పరిశోధనలో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన ఆరు రకాల కాంటాక్ట్‌ లెన్స్‌లను శాస్త్రవేత్తలు పరిశోధించారు. వాడకం వల్ల వాటిలో సాధారణంగా తలెత్తే క్షీణతను అనుకరించడం కోసం ఆ అద్దాలను నీట్లో నిల్వ ఉంచారు. సూర్యకాంతి తరహా పరిస్థితులను కలిగించే ఒక దీపం కింద వాటిని ఉంచారు. ప్రతి పదిగంటలకు మూడుసార్లు చొప్పున నీట్లో ముంచారు. ఈ విధంగా 30 లేదా 90 రోజుల సూర్యకాంతి తరహా వాతావరణానికి ఆ లెన్సులు గురయ్యేలా చేశారు. అనంతరం వాటి నుంచి వెలువడే సూక్ష్మప్లాస్టిక్‌ పోగులను లెక్కించడానికి వారు ఒక ఆటోమేటెడ్‌ వ్యవస్థను రూపొందించారు. అది నమూనాలకు సంబంధించిన సూక్ష్మ చిత్రాలను తీసింది. వాటిని ప్రాసెస్‌ చేసి, మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్యను లెక్కించింది. 90 రోజుల పాటు సూర్యకాంతికి గురైన లెన్సుల్లో ఈ పోగులను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వల్పకాలం మాత్రమే పనిచేసే లెన్సుల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో సూక్ష్మ ప్లాస్టిక్‌లు వెలువడుతున్నట్లు తేల్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని