Navalny: కడసారి చూసేందుకు అవకాశమివ్వండి.. పుతిన్‌ను వేడుకున్న నావల్నీ తల్లి

తన కుమారుడికి కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని నావల్నీ తల్లి లియుడ్మిలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వేడుకున్నారు.

Published : 20 Feb 2024 21:12 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. మృతదేహం ఎక్కడుందో ఇంతవరకు తెలియరాలేదు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి లియుడ్మిలా పుతిన్‌ (Putin)ను వేడుకున్నారు. గౌరవప్రదంగా ఖననం చేసేందుకు భౌతిక కాయాన్ని అప్పగించాలని కోరారు. నావల్నీ మృతి చెందిన జైలును సందర్శించేందుకు యత్నించిన ఆమె.. అక్కడ తీసుకున్న ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘ఐదో రోజూ నా కుమారుడి ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని అప్పగించడం లేదు. ఎక్కడుందో కూడా చెప్పడం లేదు. పుతిన్‌.. మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. నా బిడ్డను చూడనివ్వండి. భౌతిక కాయాన్ని వెంటనే అప్పగించాలని కోరుతున్నా. తద్వారా గౌరవప్రదంగా వీడ్కోలు పలకొచ్చు’’ అని ఆమె తెలిపారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని, ప్రాథమిక విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు వేచి చూడాలని అధికారులు చెప్పినట్లు నావల్నీ బృంద సభ్యులు తెలిపారు. సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.

నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలు!

క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. నావల్నీ మరణంపై అంతర్జాతీయ విచారణకు ‘ఈయూ’ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్‌ బోరెల్ పిలుపునివ్వగా.. అటువంటి డిమాండ్‌కు అంగీకరించబోమని పెస్కోవ్‌ తేల్చిచెప్పారు. మరోవైపు, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరుతూ 60 వేల మందికిపైగా ప్రజలు ప్రభుత్వానికి అభ్యర్థనలు సమర్పించారని ‘ఓవీడీ- ఇన్ఫో’  అనే హక్కుల సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని