Rishi Sunak: రిషి సునాక్ ‘పెన్ను’పై వివాదం..!

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఉపయోగించే పెన్నుపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణమేంటంటే..?

Updated : 28 Jun 2023 20:36 IST

లండన్‌: బ్రిటన్‌ (Britain) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విమర్శలను ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ (Rishi Sunak).. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఉపయోగిస్తున్న ఓ పెన్నుపై నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అది ఎరేజబుల్‌ ఇంక్‌తో ఉన్న పెన్ను (Erasable Ink Pen) కావడమే ఈ వివాదానికి కారణం. ఇంతకీ ఏంటా పెన్ను..? దీనిపై వివాదం ఎందుకంటే..?

రిషి సునాక్‌ (Rishi Sunak) గతంలో ఛాన్స్‌లర్‌గా ఉన్న సమయం నుంచే డిస్పోసబుల్‌ ‘పైలట్‌ వి’ పెన్నులను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత కూడా అదే పెన్నును అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారు. 15 రోజుల క్రితం జరిగిన కేబినెట్‌ సమావేశంలోనూ సునాక్‌ చేతిలో ఈ పెన్ను కన్పించింది. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. దీంతో ఈ పెన్నుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పైలట్‌ వి పెన్నుతో రాసిన అక్షరాలను ఎరేజ్‌ చేసుకునే సదుపాయం ఉండటంతో... భద్రతాపరంగా వీటి వాడకం అంత సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ది గార్డియన్‌ పత్రిక తమ కథనంలో పేర్కొంది. ఇంక్‌ పెన్నుతో రాయడం నేర్చుకునేవారు ఇలాంటి పెన్నులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటితో ఏదైనా తప్పుగా రాస్తే.. ఇంక్‌ ఎరాడికేటర్స్‌తో ఆ అక్షరాలను చెరిపేయొచ్చు. రిషి సునాక్‌ ఈ పెన్ను ఉపయోగిస్తుండటంతో అధికారి పత్రాల్లో ఆయన రాసిన అంశాలను ఎవరైనా చెరిపేసే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ పనులను లిఖితపూర్వకంగా భద్రపరిచేందుకు చరిత్రకారులకు ఇచ్చే పత్రాలను ఇలా ఎరేజబుల్‌ పెన్నుతో రాసినప్పుడు ఇబ్బంది ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పెన్నుల వాడకం వల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. అయితే దీనిపై 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని విశ్వసనీయ వర్గాలు స్పందించాయి. ప్రధాని తనకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకుంటారని తెలిపాయి. సునాక్‌ మీడియా కార్యదర్శి మాట్లాడుతూ.. ‘‘ఈ పెన్నును సివిల్‌ సర్వీస్‌లో విరివిగా వినియోగిస్తారు. ప్రధాని ఎప్పుడూ ఈ పెన్నుతో తన వ్యాఖ్యలను రాసి చెరిపేసే చేసే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో చేయరు కూడా’’ అని తెలిపారు. కాగా.. యూకే రిటైల్‌ మార్కెట్‌లో ఈ పెన్ను ధర ఎంతో తెలుసా? 4.75 పౌండ్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.495.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని