Ukraine Crisis: ‘ఉక్రెయిన్‌ సంక్షోభానికి అమెరికానే మూల కారణం’

ఉక్రెయిన్‌ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా తాజాగా ఆరోపించింది. ఈ మేరకు తన విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్‌ను అప్‌లోడ్‌ చేసింది. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా అగ్ర రాజ్యం సైనిక ఆధిపత్యాన్ని అనుసరించిందని ‘నార్త్ సొసైటీ...

Published : 27 Feb 2022 13:42 IST

ప్యోంగాంగ్‌: ఉక్రెయిన్‌ సంక్షోభానికి అమెరికానే మూల కారణమని ఉత్తర కొరియా తాజాగా ఆరోపించింది. ఈ మేరకు తన విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్‌ను అప్‌లోడ్‌ చేసింది. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా అగ్ర రాజ్యం సైనిక ఆధిపత్యాన్ని అనుసరించిందని ‘నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ’లో పరిశోధకుడైన రి జి సాంగ్‌కి చేసిన వ్యాఖ్యానాన్ని ఆ పోస్టులో ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా అధిక జోక్యం, ఏకపక్ష ధోరణే కారణమని, ఆ దేశం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. శాంతి, స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, అయితే.. తమ జాతీయ భద్రత కోసం ఇతర దేశాలు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను ఖండిస్తోందని చెప్పింది. అమెరికా సుప్రీం లీడర్‌గా వ్యవహరించే రోజులు పోయాయని పేర్కొంది. గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. అమెరికా, బ్రిటన్‌ సహా ఆయా దేశాలు రష్యా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మరో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం!

ఉత్తర కొరియా ఆదివారం మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. జపాన్‌ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఒకవైపు ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్‌ సంక్షోభ నివారణపై దృష్టి సారించగా.. ఇదే సమయంలో ఉత్తర కొరియా ఈ పరీక్ష చేపట్టడం గమనార్హం. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఈ దేశం ఇటీవల ఒక్క జనవరిలోనే ఏడు క్షిపణి ప్రయోగాలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో కాస్త విరామం ఇచ్చిన ఉత్తర కొరియా.. తాజాగా ఎనిమిదో ప్రయోగం చేపట్టింది! జపాన్ సముద్రం వైపు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు, ఇది సుమారు 300 కిలోమీటర్ల రేంజ్‌ కలిగి ఉందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. మరిన్ని వివరాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పింది. ఉక్రెయిన్- రష్యా పోరు నేపథ్యంలో.. అవసరమైన అణ్వాయుధాల అభివృద్ధికి, బలోపేతానికి ఇదే సరైన సమయంగా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని