Ukraine: కొనసాగుతోన్న రష్యా మారణకాండ.. మరో దాడిలో ఏడుగురు ఉక్రెయిన్ల మృతి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. అవిడివ్కాలోని మార్కెట్‌పై క్షిపణి దాడులు చేపట్టగా ఏడుగురు మృతిచెందినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

Updated : 12 Oct 2022 22:36 IST

కీవ్‌: కెర్చ్‌ వంతెన పేల్చివేతలో కీవ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం హస్తముందని భావిస్తున్న రష్యా.. మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఈసారి ఆ దేశ తూర్పు ప్రాంతంలోని అవిడివ్కా మార్కెట్‌పై క్షిపణులతో దాడులు చేపట్టింది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘జన సంచారం ఉన్న అవిడివ్కాలోని సెంట్రల్‌ మార్కెట్‌పై రష్యా చేపట్టిన దాడుల్లో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది గాయపడ్డారు’ అని స్థానిక గవర్నర్‌ పౌలో కైరెలెన్కో టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు.

పుతిన్‌ కలల ప్రాజెక్టు కెర్చ్‌ వంతెన ధ్వంసమైన తర్వాతి రోజే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేసింది. దాదాపు 84 క్షిపణులతో విరుచుకుపడింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సమీపంలో కూడా దాడి జరిగినట్లు అప్పట్లో ఆ దేశ ఇంటీరియర్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కీవ్‌తోపాటు జైటోమిర్‌, ఖెల్నిట్స్కీ, డెనిప్రో, ల్వీవ్‌, టెర్నోపిల్‌ నగరాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని