Ukraine Crisis:100 రోజుల్లో 20శాతం ఉక్రెయిన్‌ను కోల్పోయి..!

ఉక్రెయిన్‌పై సైనిక చర్యగా రష్యా చెప్పుకొంటున్న యుద్ధం 100వ రోజుకు చేరుకొంది. నాటో కూటమి సహా పశ్చిమ దేశాలు ఎన్ని గంభీరమైన హెచ్చరికలు చేసినా.. రష్యాను నిలువరించలేకపోయాయి. ఫలితంగా 20శాతం ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా

Updated : 03 Jun 2022 15:29 IST

 రష్యా ఆధీనంలోకి భారీగా భూభాగాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉక్రెయిన్‌పై సైనిక చర్యగా రష్యా చెప్పుకొంటున్న యుద్ధం 100వ రోజుకు చేరుకొంది. నాటో కూటమి సహా పశ్చిమ దేశాలు ఎన్ని గంభీరమైన హెచ్చరికలు చేసినా.. రష్యాను నిలువరించలేకపోయాయి. ఫలితంగా ఐదో వంతు ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా వంద రోజుల్లోనే స్వాధీనం చేసుకొంది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీనే లక్సంబర్గ్‌ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ అంగీకరించారు. తూర్పు ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్‌ పట్టుబిగిసింది. సీవీరోదొనెట్స్క్‌ నగరంలో అత్యధిక భాగాన్ని స్వాధీనం చేసుకొంది.

మొదట్లో తడబడినా.. నిలకడగా క్రెమ్లిన్‌ విజయాలు

ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైనిక చర్యను మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో ఉక్రెయిన్‌ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగి ‘రస్పుటిట్సా’ అనే భౌగోళిక మార్పు చోటు చేసుకొంటుంది. వేడి పెరిగి గట్టకట్టిన మంచు కరిగి నేలలు బురదమయం అవుతాయి. వీటిల్లో రష్యా ట్యాంకులు ప్రయాణించడం దుర్లభం. ఫలితంగా రోడ్లపైనే ప్రయాణించిన ట్యాంకులు  కీవ్‌ను చుట్టుముట్టే క్రమంలో భారీగా నష్టపోయాయి. దీనికి తోడు రష్యా ట్యాంక్‌ల్లోని ‘జాక్‌ ఇన్‌ ది బాక్స్‌’ అనే డిజైన్‌ లోపాన్ని ఉక్రెయిన్‌ సేనలు సమర్థంగా వాడుకొన్నాయి. ట్యాంక్‌పై టర్రెట్‌ కిందనే తూటాలను భద్రపర్చే భాగంపై దాడులు చేసి దెబ్బతీశాయి. నిర్బంధంగా సైన్యంలో పనిచేసే రష్యా కాన్‌స్క్రిప్ట్‌లు యుద్ధరంగంలోకి వచ్చారు. దీంతో వారిని నియంత్రించేందుకు రష్యా జనరల్స్‌ కూడా ఉక్రెయిన్‌కు చేరుకొన్నారు. ఇలాంటి వారిని ఉక్రెయిన్‌ సేనలు తెలివిగా అంతమొందించి.. రష్యా ఆక్రమణను వీలైనంత నిలువరించే యత్నం చేశాయి. నల్లసముద్రంలో రష్యా కీలక  యుద్ధ నౌక మాస్కోవాను కీవ్‌ క్షిపణులు ముంచేశాయి. అదే సమయంలో ఇన్ఫర్మేషన్‌ వార్ఫేర్‌లో భాగంగా రష్యా దారుణంగా దెబ్బతిందని పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. కానీ, రష్యా ఈ సారి ఇన్ఫర్మేషన్‌ వార్ఫేరును నమ్ముకోకుండా.. క్షేత్రస్థాయిలో పనిచేసింది. ఓ పక్క కీవ్‌పై గురిపెడుతూనే.. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలపై దాడులను తీవ్రం చేసింది. ఒక్కసారి వీటిపై పట్టు లభించగానే కీవ్‌ మార్గం నుంచి సేనలను తూర్పు, దక్షిణ ప్రాంతాలవైపు మళ్లించింది. ఉక్రెయిన్‌లోని భారీ పారిశ్రామిక నగరమైన మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకొని పశ్చిమ దేశాలకు రష్యా షాకిచ్చింది. దీంతో క్రిమియా ద్వీపం నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా రష్యాకు ల్యాండ్‌ కారిడార్‌ ఏర్పడింది. డాన్‌బాస్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై పట్టు సాధించి.. మరో పారిశ్రామిక నగరమైన సీవీరోదొనెట్స్క్‌ ఆక్రమణకు యత్నాలను ముమ్మరం చేసింది. 

చమురును ఆయుధంగా..

ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలకు చమురు, గ్యాస్‌ కీలకం కావడాన్ని రష్యా తెలివిగా వాడుకొంది. రూబుల్‌ విలువ పడిపోకుండా ఉండేందుకు.. రష్యాతో స్నేహపూర్వకంగా లేని దేశాలు రూబుళ్లలో చెల్లిస్తేనే ఇంధనం సరఫరా అవుతుందని రష్యా తెగేసి చెప్పింది.  ఫలితంగా రూబుల్‌ విలువ యుద్ధం మొదలైన తర్వాత పతనమైన స్థాయి నుంచి వేగంగా కోలుకొని బలపడింది. మరోపక్క ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతుల్లో 90శాతం కోత విధించాలని ఐరోపా సమాఖ్య దేశాలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా.. పశ్చిమదేశాల కంపెనీలు భారీగా రష్యాను వీడి వెళ్లిపోయాయి. రష్యా, ఒలిగార్క్‌లకు చెందిన బిలియన్ల కొద్దీ ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. 

భౌగోళిక రాజకీయాల్లో పెనుమార్పులు..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి భౌగోళిక రాజకీయాల్లో మరో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. తూర్పు ఐరోపా దేశాల్లో నాటో విస్తరణకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించింది. గతంలో ఆయా దేశాల్లో ప్రజలు సైనిక కూటముల్లో చేరేందుకు వ్యతిరేకత వ్యక్తం చేయగా.. ఇటీవల మాత్రం సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 200 ఏళ్ల నుంచి తటస్థంగా ఉన్న స్వీడన్‌, 70 ఏళ్లకు పైగా తటస్థంగా ఉన్న ఫిన్లాండ్‌ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకొన్నాయి. మరోపక్క ఇప్పటికే నాటో సభ్య దేశమైన డెన్మార్క్‌ ఐరోపా సమాఖ్య (ఈయూ) ఉమ్మడి రక్షణ విధానంలో భాగస్వామి అయ్యేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దీంతో రష్యా- అమెరికా మిత్ర దేశాల మధ్య వైరం మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

రష్యా ఇప్పట్లో సైనికచర్యను నిలిపే అవకాశాలు లేవని అమెరికా అంచనాకు వచ్చింది. అందుకే బైడెన్‌ సర్కారు 40 బిలియన్‌ డాలర్ల సైనిక,  పౌర సాయాన్ని ఇప్పటికే ప్రకటించింది. వీటిల్లో దాదాపు 20 బిలియన్‌ డాలర్లకుపైగా సైనిక సాయం రూపంలో ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నారు. ఇంత మొత్తంలో ఆయుధాలను కేవలం వారంలోనో.. నెలలోనే ఇవ్వడం అసాధ్యం. ఈ మొత్తం పూర్తిగా అందించాలంటే కనీసం కొన్ని నెలలు పట్టొచ్చు. అంటే అప్పటి వరకు యుద్ధం కొనసాగుతుందనే అమెరికా భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని