Pakistan: అఫ్గానీయుల ఇంటి బాట.. 4 లక్షలమంది వెనక్కి!

ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్‌వాసులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్‌ తెలిపింది.

Published : 20 Nov 2023 20:08 IST

ఇస్లామాబాద్‌: సరైన అనుమతులు లేకుండా పాకిస్థాన్‌ (Pakistan)లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1వ తేదీ నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్‌ అధికారులు.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్‌వాసులు (Afghans) తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు తాజాగా వెల్లడించారు. తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ఈ సంఖ్యను ధ్రువీకరించారు. చాలా మంది టోర్ఖం, స్పిన్ బోల్డాక్ సరిహద్దుల గుండా తమ దేశానికి తిరిగి వచ్చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు. వారికి ఆశ్రయం, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.

మా దేశం విడిచి వెళ్లిపోండి.. అఫ్గాన్‌ వాసులకు పాకిస్థాన్‌ హుకుం

1980ల్లో సోవియట్‌ యూనియన్‌ ఆక్రమణ సమయంలో లక్షలాది మంది అఫ్గాన్‌వాసులు శరణు కోరుతూ పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. 2021లో తాలిబన్లు అఫ్గాన్‌ను తిరిగి అక్రమించుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. అయితే.. వారిలో దాదాపు 17 లక్షల మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు పాక్‌ ఆరోపించింది. సరైన పత్రాలు లేనివారంతా నవంబర్‌ 1వ తేదీ లోపు దేశం విడిచి పోవాలని ఆదేశించింది. ఇది హక్కుల ఉల్లంఘనే అని ఐరాస నుంచి ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. ఈ నిర్ణయంపై ముందుకెళ్లింది. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా ఇక్కడే అక్రమంగా నివసిస్తోన్నవారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు.

వీసా ఉంటేనే ప్రవేశం కల్పించేలా..!

పాకిస్థాన్‌ సరిహద్దులోని చమన్‌ నగరం నుంచి అఫ్గాన్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ఇదివరకు స్థానికులకు ప్రత్యేక అనుమతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీసాలు అవసరమయ్యేలా పాకిస్థాన్‌ అధికారులు ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాన్ని వేలాది మంది స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇరు ప్రాంతాలను కలిపే కీలక రహదారిపై సోమవారం రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక అనుమతులను కొనసాగించాలని, పొరుగునే అఫ్గాన్‌లోని స్పిన్ బోల్డాక్‌లో నివసించే తమ బంధువులను కలవడానికి అనుమతించాలని కోరుతూ వారు నిరసనలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని