Sri Lanka: 70 ఏళ్ల శ్రీలంక చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత..!

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక  70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. శ్రీలంక చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ను కూడా బుధవారంతో ముగియడంతో

Published : 20 May 2022 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా బుధవారం ముగిసిపోవడంతో అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది. ఈ విషయాన్ని గురువారం రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వెల్లడించారు. ‘‘మా వైఖరి స్పష్టంగా ఉంది. వారు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేంత వరకూ మేము చెల్లింపులు చేయలేం. దానిని ముందస్తు దివాలా అంటారు. వీటిల్లో సాంకేతిక నిర్వచనాలు ఉన్నాయి. వారి వైపు నుంచి దీనిని రుణ ఎగవేతగా భావిస్తారు’’ అని వెల్లడించారు.

శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన బెయిల్‌ఔట్‌పై అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. గురవారం ఐఎంఎఫ్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఈ చర్చలు వచ్చే మంగళవారానికి పూర్తికావొచ్చని వెల్లడించారు. శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది దేశాన్ని నడిపేందుకు 4 బిలియన్‌ డాలర్లు అవసరమని చెబుతోంది.

శ్రీలంక 50 బిలియన్‌ డాలర్లు విలువైన రుణాలను చెల్లించేందుకు వీలుగా పునర్‌ వ్యవస్థీకరించాలని విదేశీ రుణదాతలను కోరుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు విదేశీ మారకద్రవ్యం కొరత, ద్రవ్యోల్బణంలో పెరుగుదల కారణంగా ఔషధాలు, ఇంధనం కొరత ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని