Sri Lanka: పెను ఆహార సంక్షోభం అంచున శ్రీలంక..!

శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రనిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్‌ నాటికి సరిపడా ఎరువులు కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.

Published : 20 May 2022 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్‌ నాటికి సరిపడా ఎరువులు కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. ‘‘సరిపడా సమయం లేకపోవడంతో ఈ యాలా(మే-ఆగస్టు) సీజన్‌లో ఎరువులు కొనుగోలు చేయలేము. మహా (సెప్టెంబర్‌-మార్చి) సీజన్‌కు సరిపడా ఎరువుల స్టాక్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాం. తాజా పరిస్థితిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని విక్రమసింఘే గురువారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

కొత్తగా 9 మంది మంత్రులు..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్తగా తొమ్మిది మందిని మంత్రులుగా నియమించారు. పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటయ్యే వరకు వీరు కీలక కార్యకలాపాలను నిర్వహించనున్నారు. కొత్త మంత్రివర్గంలో ఫ్రీడమ్‌పార్టీకి చెందిన నిమాల సిరిపాల డిసిల్వా, ఇండిపెండెంట్‌ ఎంపీలు సుశీల్‌ పరమజయంత, విజ్యాదాస రాజపక్సా, తిరన్‌ ఎల్లెస్‌ ఉన్నారు. వీరితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీలంక కేబినెట్‌లో అధ్యక్షుడు, ప్రధానితో కలిపి అత్యధికంగా 25 మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో నిమాల సిరిపాల డిసిల్వా నౌకా, విమానయాన శాఖ, సుశీల్‌ పరమజయంతకు విద్యాశాఖ, ఖేలియా రంబుక్‌వెల్లాకు వైద్యశాఖ, విజ్యాదాస రాజపక్సాకు న్యాయ,జైళ్లు, రాజ్యాంగ సంస్కరణలు శాఖలు అప్పజెప్పినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ సారి కీలకమైన ఆర్థిక శాఖను భర్తీ చేయకపోవడం విశేషం. 

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఏప్రిల్​ 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్​ గ్రీన్​లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. యునైటెడ్​ నేషనల్​ పార్టీ నేత రణిల్​ విక్రమ్​ సింఘే(73)ను 26వ ప్రధానిగా నియమించారు. అందుకు పార్లమెంట్​లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని