Gotabaya Rajapaksa: మాల్దీవులు-సౌదీ అరేబియా వయా సింగపూర్..!

ద్వీపదేశం శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Updated : 14 Jul 2022 15:02 IST

రాజీనామా చేయకుండా దేశాలు దాటుతున్న రాజపక్స

(పాత చిత్రం)

కొలంబో: ద్వీపదేశం శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సింగపూర్‌కు బయల్దేరారని శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడించాయి.

గొటబాయ రాజీనామా చేయాలని గత శనివారం మొదలైన నిరసన జ్వాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిన్న ఆయన దేశం దాటి మాల్దీవులకు వెళ్లారనే వార్తలు ఆందోళనకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో నిన్న మరోసారి తమ నిరసనలు ఉద్ధృతం చేశారు. దాంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన రణిల్ విక్రమసింఘే ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒకవైపు దేశంలో పరిస్థితులు ఇలాఉంటే.. గొటబాయ మాత్రం దేశాలు దాటుతున్నారు. ప్రస్తుతం ఆయన సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానంలో తమ దేశం నుంచి వెళ్లిపోయారని మాల్దీవుల అధికారులు వెల్లడించారు. ఆ విమానంలో తొలుత సింగపూర్, ఆ తర్వాత సౌదీ అరేబియాకు చేరుకోనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తనను దేశం దాటనిస్తేనే రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టిన ఆయన.. సురక్షితంగా గమ్యస్థానం చేరిన తర్వాత పదవిని వీడనున్నట్లు తెలుస్తోంది. 

అధ్యక్ష, ప్రధాని భవనాలను ఖాళీ చేస్తోన్న నిరసనకారులు..

అధ్యక్షుడు, ప్రధానిని గద్దె దింపాలని నిరసనలు ప్రారంభించిన శ్రీలంక ప్రజలు.. ఆ క్రమంలో అధికారిక నివాసాలను ఆక్రమించారు. తాజాగా వాటిని ఖాళీ చేసేందుకు అంగీకరించారు. అయితే, తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 200 ఏళ్ల నాటి ఆ భవనాలు దేశ సంపదని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని పలువురు పిలుపునిచ్చారు. మరోపక్క, రణిల్ కూడా ఆ భవనాలను స్వాధీనం చేసుకోవాలని నిన్న బలగాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిరసనకారుల నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో కర్ఫ్యూ విధించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని