Ayodhya: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వీధుల్లో రామ భజనలు

Ayodhya: అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రవాస భారతీయులు వేడుకలు చేసుకుంటున్నారు.

Updated : 22 Jan 2024 12:27 IST

న్యూయార్క్‌: అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. కూడలిలోని విద్యుత్‌ బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 

ప్రవాస భారతీయులు టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకుంటున్నారు. మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌ నగర మేయర్‌ జో పెట్టీ హిందూ సమాజానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

శ్రీరాముడి ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం: మారిషస్‌ ప్రధాని

అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ కార్యక్రమం (Ram Lalla Idol consecration) ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది.

* ఫ్రాన్స్‌లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం ఈఫిల్‌ టవర్‌ వద్దకు చేరి జైశ్రీరామ్‌ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని