Independence Day: స్టన్నింగ్‌ చిత్రంతో ఐఎస్‌ఎస్‌ నుంచి భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన యూఏఈ ఆస్ట్రోనాట్‌

అంతరిక్ష కేంద్రం నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆస్ట్రోనాట్‌ సుల్తాన్‌ అల్‌ నెయదీ భారత పౌరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్పేస్‌ స్టేషన్‌ నుంచి తీసిన దిల్లీ ఫొటోను ఈ సందర్భంగా ట్విటర్‌(ఎక్స్‌)లో పోస్టు చేశారు. 

Updated : 16 Aug 2023 03:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independence Day) దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని చేతబూని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ పౌరులు 77వ స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) వ్యోమగామి సుల్తాన్‌ అల్‌నెయదీ భారత పౌరులకు వినూత్నంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 11 భారతీయ భాషల్లో నమస్కారం చెబుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి తీసిన అద్భుతమై దిల్లీ(Delhi) నగరం ఫొటోను ట్విటర్‌(ఎక్స్‌)లో పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ‘స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. వెలుగులీనుతున్న అద్భుతమైన దిల్లీ మహానగరాన్ని కెమెరాలో బంధించి, భారతీయులకు శుభాకాంక్షలు చెప్పినందుకు నెటిజన్లు అల్‌నెయదీకి కృతజ్ఞతలు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

యూఏఈకి చెందిన అల్‌నెయదీ ఆరునెలల స్పేస్‌ మిషన్‌(Space Mission) కార్యక్రమంలో భాగంగా ఈ ఏప్రిల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ నెల 31న ఆయన భూమిపైకి చేరుకోనున్నారు. అరబ్‌ దేశం నుంచి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి ఆస్ట్రోనాట్‌గా అల్‌నెయదీ చరిత్రకెక్కారు. స్పేస్‌ స్టేషన్‌ భూమి నుంచి 400 కి.మీలో ఎత్తులో ఉన్న విషయం తెలిసిందే. 

ప్రపంచంలోనే అతిఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలిఫాపై భారత త్రివర్ణ పతాకం ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బుర్జ్‌ ఖలీఫా ట్వీట్‌ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని