Variant XE: ఒమిక్రాన్‌ ఉపరకం కంటే 10శాతం ఎక్కువ వ్యాప్తి..!

ఒమిక్రాన్‌ ఉపరకాల్లో ఉత్పరివర్తనం చెందిన వేరియంట్‌ (XE రకం)ను గుర్తించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు.

Published : 06 Apr 2022 02:09 IST

పరిశోధనలు ముమ్మరం చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి అదుపులో ఉన్న వేళ కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్లు మరోసారి కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ఉపరకాల్లో ఉత్పరివర్తనం చెందిన వేరియంట్‌ (XE రకం)ను గుర్తించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం XE రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇటీవల ఇంగ్లాండ్‌లో వెలుగు చూసిన కొత్తవేరియంట్‌ XE.. మార్చి 22 నాటికి 637 కేసులు గుర్తించినట్లు యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) పేర్కొంది. ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.1, బీఏ.2 రకాల మ్యుటేషన్‌ల కారణంగా ఏర్పడిన ఈ కొత్తరకం వేరియంట్‌లపై అధ్యయనం ముమ్మరం చేసిన శాస్త్రవేత్తలు.. రీకాంబినెంట్‌గా పిలిచే ఇటువంటివి సాధారణంగా త్వరగా చనిపోతాయని చెబుతున్నారు. ఇప్పటివరకు XE వ్యాప్తి, తీవ్రత, వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లేవని యూకేహెచ్‌ఎస్‌ఏకు చెందిన ప్రొఫెసర్‌ సుసాన్‌ హాప్కిన్స్‌ పేర్కొన్నారు. అయితే, కొత్త సమాచారం వస్తున్నా కొద్దీ ఈ అంచనాలు స్థిరంగా ఉండవని.. వైరస్‌ వృద్ధి రేటులో మార్పు ఉండవచ్చని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో XE వేరియంట్‌ సామాజిక వ్యాప్తిలో ఉందనే అనుమానాలను కూడా యూకేహెచ్‌ఎస్‌ఏ నిపుణులు వ్యక్తం చేశారు.

తీవ్రత తక్కువేనా..?

ఇప్పటికే XE వేరియంట్‌ కేసులు థాయిలాండ్‌, న్యూజిలాండ్‌లలోనూ వెలుగు చూశాయి. ఈ మ్యుటేషన్‌ గురించి చెప్పాలంటే మరింత సమాచారం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొంది. అయితే, బీఏ.2తో పోలిస్తే ఈ వేరియంట్‌ వ్యాప్తి 10శాతం ఎక్కువగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని తెలిపింది. అయినప్పటికీ, XE వేరియంట్‌ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటివరకు బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ రకాలన్నీ తక్కువ తీవ్రత కలిగినవనే విషయాన్ని గుర్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని