Ukraine crisis: రెండు నెలల తర్వాత.. ఆ భవన శిథిలాల కింద 44 శవాలు..!

సైనిక చర్య పేరుతో దండయాత్రకు దిగిన రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబుల మోత మోగిస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో అనేక భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయక

Published : 10 May 2022 14:04 IST

ఖర్కివ్‌లో రష్యా దారుణాలు..

కీవ్‌: సైనిక చర్య పేరుతో దండయాత్రకు దిగిన రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబుల మోత మోగిస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో అనేక భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ భవనంపై బాంబులు జారవిడిచింది. ఆ భవన శిథిలాల కింద తాజాగా 44 మృతదేహాలు బయటపడ్డాయి.

ఖర్కీవ్‌లోని ఇజియం ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం రష్యా దాడులకు కూలిపోయింది. ఆ సమయంలో భవనంలో పౌరులు కూడా ఉన్నారు. మార్చి తొలి వారంలో ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ భవన శిథిలాల కింద 44 మృతదేహాలను అధికారులు గుర్తించినట్లు ఖర్కివ్‌ రీజనల్ అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌ ఒలే సినెహుబోవ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. ఉక్రెయిన్‌ పౌరులపై రష్యా సేనలు పాల్పడిన మరో భయానక యుద్ధ నేరంగా దీన్ని పేర్కొన్నారు.

గత 11 వారాలుగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం సాగిస్తోంది. తొలుత సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన క్రెమ్లిన్‌.. ఆ తర్వాత జనావాసాలపైనా విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఖర్కివ్‌, మెరియుపోల్‌ భారీగా నష్టపోయాయి. ఇటీవల లుహాన్స్క్‌ ప్రాంతంలో ఓ పాఠశాల షెల్టర్‌ భవనంపై బాంబు దాడి చేయగా.. 60 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు మెరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా బాంబులు జారవిడిచింది. ఆ సమయంలో థియేటర్‌లో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఇందులో కనీసం 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని