United Nations: ఏదైనా సమాచారాన్ని షేర్ చేస్తున్నారా..? ఈ ఐదు ప్రశ్నలు వేసుకోండి

నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకుగానూ ప్రతి ఒక్కరూ.. తమనుతాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఐదు ప్రశ్నలను లిస్ట్‌ చేసింది.

Published : 14 Oct 2022 01:37 IST

జెనీవా: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగింది. దీనికి తోడు సామాజిక మాధ్యమాలు రాజ్యమేలుతున్నాయి! దీంతో బోలెడంత సమాచారం అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలోనే చాపకింద నీరులా.. నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారం(Misinformation) సైతం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కంటెంట్‌లో వాస్తవమెంత? అనేది ధ్రువీకరించుకోకుండానే చాలా మంది ఇతరులకు పంపిస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐక్యరాజ్యసమితి(United Nations) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకుగానూ ప్రతి ఒక్కరూ.. తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐదు ప్రశ్నలను లిస్ట్‌ చేసింది.

* ఆ సమాచారాన్ని ఎవరు రూపొందించారు?

* దానికి ఆధారం(సోర్స్‌) ఏంటి?

* ఆ సమాచారం ఎక్కడినుంచి వచ్చింది?

* మీరు ఎందుకు షేర్‌ చేస్తున్నారు?

* అది ఎప్పుడు పబ్లిష్‌ అయింది?

‘సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచార వ్యాప్తితో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఆన్‌లైన్‌లో మనం చూసేవన్నీ నిజాలు కావు. ఈ నేపథ్యంలో.. మీరు ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు.. వాస్తవాలను ధ్రువీకరించుకునేందుకుగానూ కొంత సమయాన్ని వెచ్చించండి. మిమ్మల్ని మీరు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోండి’ అని ఐరాస తన పోస్ట్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. డబ్ల్యూహెచ్‌వో, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ తదితర ఐరాస సంస్థలు సైతం ఆన్‌లైన్‌లో నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలకు తమవంతు సహకారం అందజేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని