G20 Summit: జీ20 గ్రాండ్‌ సక్సెస్‌.. అమెరికా ఏం చెప్పిందంటే..?

G20 Summit: గత వారం భారత్‌ రెండు రోజుల పాటు జీ20 దేశాధినేతల సదస్సు నిర్వహించింది. దీనిపై అమెరికా, చైనా తమ అభిప్రాయం తెలియజేశాయి. 

Updated : 12 Sep 2023 10:22 IST

వాషింగ్టన్‌: భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) అట్టహాసంగా జరిగింది. ఇది సంపూర్ణ విజయం సాధించిందంటూ అమెరికా(USA) స్పందించింది. ఈ సదస్సు విజయవంతమైందా..? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు యూఎస్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ మేరకు బదులిచ్చారు.

‘ఈ సదస్సు సంపూర్ణ విజయం సాధించిందని మేం నమ్ముతున్నాం. జీ20 ఒక పెద్ద కూటమి(G20 Summit). దానిలో రష్యా(Russia), చైనా(China) కూడా సభ్యదేశాలే’ అని అన్నారు. అలాగే సదస్సులో భాగంగా రష్యా(Russia) పేరు ప్రస్తావించకుండా దిల్లీ డిక్లరేషన్ జారీ చేయడంపై స్పందిస్తూ.. ‘ఈ కూటమిలో విభిన్న అభిప్రాయాలు కలిగిన సభ్య దేశాలున్నాయి. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిస్తూ ఈ కూటమి ఒక ప్రకటన జారీ చేయగలిగింది. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడి నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన ప్రకటన అని మేం భావిస్తున్నాం’ అని మిల్లర్‌ అన్నారు.

చైనా బెల్ట్‌కు చెక్‌!

జీ20 కూటమి(G20 Summit) అధ్యక్ష హోదాలో భారత్‌.. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. సంయుక్త ప్రకటనలో రష్యా పేరును ప్రస్తావించకుండానే ఉక్రెయిన్‌ అంశంపై జీ20 కూటమి పలు సూచనలు చేసింది. అణు బెదిరింపులు తగవని, ఇది యుద్ధాల శకం కాదని స్పష్టంచేసింది. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది.

అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాన్ని దిల్లీ డిక్లరేషన్‌(Delhi Declaration) ఇస్తోందంటూ చైనా స్పందించింది. ఆర్థిక పునరుద్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతాన్ని పంపిస్తోందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని