Ukraine: ఉక్రెయిన్‌లో కిరాయి కాలకేయ సైన్యం యుద్ధం ఇలా..!

పుతిన్‌ వంటమనిషిగా పేరున్న ప్రిగోజిన్‌ ఆధ్వర్యంలోని కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లోని బక్ముట్‌ వద్ద అరాచకంగా పోరాడుతోంది. వారి యుద్ధ పద్ధతులు చూసి ఉక్రెయిన్‌ సైన్యం కూడా ఆందోళన చెందుతోంది. 

Updated : 24 Jan 2023 23:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్‌ వద్ద పోరాడుతోంది. ఈ కిరాయి మూక పోరాటశైలి చూసి ఉక్రెయిన్‌ బలగాలే అవాక్కయ్యాయి. వందల మంది ప్రాణాలు కోల్పుతున్నా.. యుద్ధ క్షేత్రాన్ని మాత్రం వదిలి వెళ్లడంలేదు. వాగ్నర్‌ గ్రూప్‌ పోరాట విధానంపై 2022 డిసెంబర్‌లో ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఓ ఆంగ్లపత్రిక చేతికి వచ్చింది. ముఖ్యంగా అర్బన్‌ వార్ఫేర్‌లో ఈ గ్రూపు ప్రమాదకరంగా పరిణమించిందని దానిలో పేర్కొన్నారు. ఈ గ్రూపులో ఎంత మంది ప్రాణాలు కోల్పోయినా రష్యాకు లెక్కలేదని ఆ నివేదిక వెల్లడించింది.

వాగ్నర్‌ వద్ద మోటరోలా కమ్యూనికేషన్‌ పరికరాలు..!

వాగ్నర్‌ తన కిరాయి సైనికులను చిన్న చిన్న గ్రూపులుగా విభజించింది. ఈ గ్రూపులోని వారు ఒక్కసారి పోరాటంలోకి అడుగుపెట్టాక ఆదేశాలు లేకుండా వెనక్కితగ్గరు. ఒక వేళ వెనక్కి తగ్గితే.. వారిని అక్కడికక్కడే చంపేస్తారు. లొంగిపోవడానికి ప్రయత్నించే సహచరులను నిర్దాక్షిణ్యంగా చంపడానికి వెనుకాడరు. యుద్ధ రంగంలో గాయపడిన సహచరులను ఏమాత్రం పట్టించుకోరు. వారిని అక్కడే వదిలేసి లక్ష్యాన్ని సాధించేందుకు దాడులను కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ గ్రూపులో మొత్తం 50,000 మంది ఉండొచ్చని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 80 శాతం మంది ఖైదీలేనని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఇటీవలే వెల్లడించింది. ఈ సంస్థ ఎప్పటి నుంచో ఉన్నా.. 2022లో అధికారికంగా రిజిస్టర్‌ చేయించారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో దీని హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. 

*  చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయినా వాగ్నర్‌ గ్రూప్‌ డ్రోన్ల ద్వారా సమాచారం సేకరించి లక్ష్యాలపై రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్ల(ఆర్‌పీజీ)తో దాడులు చేస్తోంది. అర్బన్‌ వార్ఫేర్‌లో ఇది ప్రత్యర్థులకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

* ఈ గ్రూపులోని కొందరు అమెరికాకు చెందిన మోటరోలా తయారు చేసిన కమ్యూనికేషన్‌ పరికరాలను వాడుతున్నట్లు ఉక్రెయిన్‌ గుర్తించింది. మరో వైపు మోటరోలా మాత్రం యుద్ధం మొదలుకాగానే తాము రష్యాలో కార్యకలాపాలను మూసివేశామని సీఎన్‌ఎన్‌కు వెల్లడించింది.

* రష్యాలో వివిధ కేసుల్లో ఉన్న ఖైదీలను ఈ గ్రూపు నియమించుకొంది. వీరిని తమ లక్ష్యంపై తొలిసారిగా దాడి జరిపేందుకు పంపిస్తోంది. అలా వెళ్లిన వారిలో దాదాపు 80 శాతం మరణించడమో, గాయపడటమో జరుగుతోంది. ఆ తర్వాత వాగ్నర్‌లో శిక్షణ పొందిన సైనికులను అక్కడకు తరలిస్తోంది. వీరి వద్ద థర్మల్‌ ఇమేజరీ - నైట్‌ విజన్‌ పరికరాలు ఉంటున్నాయి.

* వాగ్నర్‌ గ్రూప్‌ ఏదైనా ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోగానే వారికి రష్యా శతఘ్ని దళం నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో వారు ఆ ప్రదేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొంటారు. వీటిల్లో ఎక్కువగా కందకాలే ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో రష్యా సైన్యంతో సమన్వయ లోపాలు ఏర్పడుతున్నట్లు ఉక్రెయిన్‌ గుర్తించింది. ఆ సమయంలో రష్యా సైన్యమే వాగ్నర్ల కందకాలను ధ్వంసం చేస్తోంది.

* వాగ్నర్‌ ప్రైవేటు మిలటరీ కంపెనీ రష్యా సైన్యంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి వాగ్నర్‌కు ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. గత నెలలో ఉత్తర కొరియా నుంచి భారీ ఎత్తున రాకెట్లు, క్షిపణులను వాగ్నర్‌ కోసం రష్యాకు పంపించారు.

* ప్రస్తుతం ఈ గ్రూపు వద్ద మల్టిపుల్‌ రాకెట్‌ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థ ఉన్నట్లు ఇటీవల వాగ్నర్‌ ప్రైవేటు మిలటరీ అధిపతి ప్రిగోజిన్‌ స్వయంగా వెల్లడించాడు.

* రష్యాలో వాగ్నర్‌ పరపతి పెరుగుతోంది. ఈ సైన్యం ఇటీవల ఉప్పు గనుల నగరం సొలెడార్‌ను ఆక్రమించింది. కానీ, రష్యా సైన్యం దీనిని అంగీకరించలేదు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వాగ్నర్‌ గ్రూపు సొలెడార్‌ ఆక్రమణలో వీరోచితంగా పోరాడిందని అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని