Japan: కీలక పత్రాలు పోగొట్టిన ఉద్యోగి.. చిక్కుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద అణు కేంద్రం!

ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ ‘కాషీవాజాకీ- కరీవా’కు చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ అణు కేంద్రానికి సంబంధించిన కీలక పత్రాలను ఓ ఉద్యోగి కారుపై పెట్టి మర్చిపోవడం గమనార్హం.

Updated : 26 May 2023 12:11 IST

టోక్యో: ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం (Nuclear Power plant) ‘కాషీవాజాకీ- కరీవా’కు మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే భద్రతా లోపాల కారణంగా జపాన్‌ (Japan)లోని ఈ న్యూక్లియర్‌ ప్లాంట్‌ పునః ప్రారంభం వాయిదా పడగా, తాజాగా ఇక్కడి ఓ ఉద్యోగి.. ప్లాంట్‌కు సంబంధించిన కీలక పత్రాల (Power Plant Documents)ను పోగొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఉద్యోగి.. సంబంధిత పత్రాలను కారు మీద పెట్టి మర్చిపోయారని ప్లాంట్‌ను నిర్వహించే ‘టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (TEPCO)’ వెల్లడించడం గమనార్హం.

జపాన్‌లో ప్రస్తుతం 33 క్రియాశీల అణు రియాక్టర్లు ఉన్నాయి. జాతీయ అణు నియంత్రణ ప్రాధికార సంస్థ వీటిని పర్యవేక్షిస్తుంది. అయితే, 2011 ఫుకుషిమా విపత్తు నేపథ్యంలో చాలావాటిని మూసివేశారు. ఇప్పుడు వాటి పునః ప్రారంభానికి.. భద్రతాపర లోపాలు, కఠినమైన నియంత్రణ చర్యలు సవాళ్లుగా నిలుస్తున్నాయి. ‘కాషీవాజాకీ- కరీవా’ ప్లాంట్‌లో చేపట్టిన భద్రతాపర ఏర్పాట్లు చాలవని చెబుతూ.. దానిపై విధించిన నిషేధాన్ని కొనసాగించాలని వారం క్రితమే అణు పర్యవేక్షణ సంస్థ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కీలక పత్రాలు పోగొట్టడం ప్లాంట్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

‘కాషీవాజాకీ- కరీవా’ ప్లాంట్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు ఇటీవల ఓ స్థానికుడికి దొరకడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పేపర్లను తిరిగి పొందేందుకు సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం విషయంలో ఉద్యోగులు, మేనేజర్లకు ‘టెప్కో’ హెచ్చరికలు జారీ చేసింది. కీలక పత్రాలు, సమాచారం విషయంలో సిబ్బంది కఠినమైన నియమాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని