Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి

భారత్‌ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌-5’కు హంబనటొట ఓడరేవులో ప్రవేశానికి శ్రీలంక తాజాగా మరోసారి అనుమతులు మంజూరు చేసింది. అసలు ఈ నౌకకు తొలుత అనుమతి...

Published : 14 Aug 2022 02:32 IST

కొలంబో: భారత్‌ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌-5’కు హంబనటొట ఓడరేవులో ప్రవేశానికి శ్రీలంక తాజాగా మరోసారి అనుమతులు మంజూరు చేసింది. అసలు ఈ నౌకకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్‌ తీవ్రంగా స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన లంక.. ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్‌ను కోరింది. అయితే.. నౌకను ఎందుకు అనుమతించకూడదనే ప్రశ్న చైనానుంచి ఎదురుకాగా.. శ్రీలంక సంతృప్తికర జవాబు ఇవ్వడంలో విఫలమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో తొలుత ఆగస్టు 11న రావాల్సిన నౌక.. ప్రస్తుతం ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబన్‌టొటలో లంగరు వేయనుంది. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ క్లియరెన్స్‌ లభించినట్లు శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా ఓ వార్తా సంస్థకు తెలిపారు.

శుక్రవారం రాత్రికి ఈ నౌక శ్రీలంకకు ఆగ్నేయంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉందని, హంబన్‌టొట వైపు నెమ్మదిగా కదులుతోందని ఓడరేవు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘యువాన్‌ వాంగ్‌-5’.. క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులు దీని నిఘా పరిధిలో వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌ ఈ నౌక రాకపై అభ్యంతరం తెలుపుతోంది. అయితే, నౌక ప్రయాణాన్ని నిలువరించేందుకు భారత్‌.. కొలంబోపై ఒత్తిడి తెచ్చిందని చైనా ఇటీవల ఆరోపించింది. భారత ప్రభుత్వం మాత్రం వాటిని తిరస్కరిస్తూ.. సార్వభౌమాధికార దేశంగా శ్రీలంక తన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని