APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీలో పదోన్నతుల పండుగ

తాజా వార్తలు

Published : 15/09/2021 01:55 IST

APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీలో పదోన్నతుల పండుగ

 

అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీలో పదోన్నతుల పండుగ ప్రారంభమైంది. పదోన్నతి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఉద్యోగుల కల నెరవేరుతోంది. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ఈనెలాఖరులోపు పదోన్నతులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు ఆదేశాలిచ్చారు. ఈమేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ అర్హుల జాబితా రూపొందించడంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆర్టీసీలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. దీంతో రెండేళ్లుగా  పదవీవిరమణలు నిలిచిపోయాయి. చాలా మంది పదోన్నతులు పొందాల్సి ఉండగా ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు పొందలేక పోయారు. 60 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు ఈనెలాఖరున పదవీవిరమణ చేయబోతున్నారు. దీంతో ఈనెలాఖరు నుంచి  ఆర్టీసీలో ఉద్యోగుల పదవీవిరమణ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇకపై నెలకు 200 నుంచి 300 వరకు ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో నిబంధనలు అనుసరించి ఖాళీ అయిన స్థానాల్లో పలు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పదోన్నతులు ఇచ్చే అంశంపై 2011, 2019లో ఆర్టీసీ యాజమాన్యం నిబంధనలు రూపొందించింది. 2019లో అప్పటి ఎండీ సురేంద్రబాబు హయాంలో తాజాగా నిబంధనలు సవరించారు. వీటినే బోర్డులో ఆమోదముద్ర తీసుకుని పదోన్నతులు చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం తొలిసారిగా పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలన్న ఎండీ ఆదేశాల మేరకు ఆఘమేఘాల మీద దస్త్రాలు సిద్దమవుతున్నాయి. కండక్టర్లు,  మెకానిక్ లు, జూనియర్ అసిస్టెంట్లు,  సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజీ సూపర్ వైజర్లు,  ట్రాపిక్ సూపర్ వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మంది పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. పదోన్నతుల అనంతరం సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ లేదా నేరుగా భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని