విమాన, రక్షణ పరిశ్రమల రంగాల్లో తెలంగాణ ప్రగతి

ప్రధానాంశాలు

విమాన, రక్షణ పరిశ్రమల రంగాల్లో తెలంగాణ ప్రగతి

టాటా బోయింగ్‌ విజయోత్సవంలో మంత్రి కేటీఆర్‌
  వందో అపాచీ హెలికాప్టర్‌ క్యాబిన్‌ తయారీ

ఈనాడు, హైదరాబాద్‌: విమానాల తయారీ, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఎగుమతుల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ అపాచీ హెలికాప్టర్‌ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. అపాచీ హెలికాప్టర్ల 100వ క్యాబిన్‌ పంపిణీని పురస్కరించుకుని శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘విమానాల తయారీ, రక్షణ రంగాలకు తెలంగాణ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వ్యయ సమర్థతలో విమానాల తయారీ, రక్షణ రంగాల్లో ఎఫ్‌డీఐ ఫ్యూచర్‌ ఏరోస్పేస్‌ సిటీస్‌ ర్యాంకింగ్స్‌-2020లో హైదరాబాద్‌ ప్రథమ ర్యాంకు సాధించింది. ఏరోస్పేస్‌ రంగంలో అపూర్వమైన వృద్ధి సాధించిన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ 2018, 2020 సంవత్సరాల్లో ఉత్తమ పురస్కారాన్ని తెలంగాణకు ప్రకటించింది. ఈ రంగాల్లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వంటి అత్యుత్తమ సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు గల నైపుణ్యాల, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. టాటా బోయింగ్‌ అతి తక్కువ సమయంలోనే వందో మైలురాయిని అందుకోవడం అభినందనీయం. టాటా బోయింగ్‌ సాధించిన ఘనత తెలంగాణకు గర్వకారణం’’ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా బోయింగ్‌ భారత విభాగం అధ్యక్షుడు సలీల్‌ గుప్తె మాట్లాడుతూ ఇక్కడి ప్రభుత్వ విధానాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండడం వల్లనే తెలంగాణ ఉత్పత్తులకు కేంద్రంగా మారుతోందని అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో తాము భాగస్వాములం కావడం ఆనందంగా ఉందని, గత రెండేళ్లలో భారత్‌ నుంచి బిలియన్‌ డాలర్లకు పైగా ఉత్పత్తులను చేయగలిగామని తెలిపారు. కార్యక్రమంలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఎండీ, సీఈవో సుకరణ్‌సింగ్‌,  పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని