గెజిట్‌ అమలులో అవరోధాలు ఏమిటి?

ప్రధానాంశాలు

గెజిట్‌ అమలులో అవరోధాలు ఏమిటి?

ఒకట్రెండు రోజుల్లో కృష్ణా, గోదావరి బోర్డులతో జల్‌శక్తిశాఖ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌ అమలుపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై కేంద్రం దృష్టిసారించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు బోర్డులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీ నుంచి గెజిట్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ పరిధిలో కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద 15 అవుట్‌లెట్లు, గోదావరి పరీవాహకంలోని పెద్దవాగు ప్రాజెక్టులను మొదటి దశలో అప్పగించాలనే అంశంపై బోర్డులు తీర్మానాలు చేశాయి. వీటిపై రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు (జీవో) జారీచేయాల్సి ఉంది. కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. బోర్డుల సమావేశాల్లో ప్రతిపాదనలపై తీర్మానాలను ఆమోదించాక కూడా వాటి అమలులో జరుగుతున్న     జాప్యం, అవరోధాలను తొలగించడమే ధ్యేయంగా జల్‌శక్తిశాఖ బోర్డులతో ఆన్‌లైన్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.

‘నదుల అనుసంధానం’పై ఏం చెబుదాం!
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన ప్రాజెక్టు అమలుపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు, హక్కులను వినిపించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆన్‌లైన్‌లో సంబంధిత రాష్ట్రాల సీఎంలతో ఈ విషయమై మాట్లాడనున్నారు. 29వ తేదీన హైదరాబాద్‌లో తొమ్మిది రాష్ట్రాల నీటిపారుదల శాఖలతో జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి బేసిన్‌లో ఇప్పుడున్న నీటి వినియోగం ఎంత? నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర అవసరాలు ఏ మేరకు ఉంటాయి? తదితర అంశాలు కేంద్రానికి వివరించేలా తెలంగాణ అంతరాష్ట్ర జల వనరుల విభాగం ఓ ప్రజంటేషన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు కూడా తెలిసింది. గోదావరి, కృష్ణా పరీవాహకంలో నీటి అవసరాలు, కేటాయింపులు, ట్రైబ్యునళ్లలో కొనసాగుతున్న వ్యాజ్యాలు తదితర అంశాలనూ కేంద్రం ముందు పెట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని