చంద్రబాబుకే రక్షణ లేకుంటే సామాన్యుల గతేంటి?

ప్రధానాంశాలు

చంద్రబాబుకే రక్షణ లేకుంటే సామాన్యుల గతేంటి?

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

ఈనాడు, హైదరాబాద్‌: జడ్‌ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం చంద్రబాబునాయుడికే రక్షణ లేకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. విజయవాడలో చంద్రబాబు ఇంటిపై ఏపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడియత్నానికి నిరసనగా తెదేపా రాష్ట్ర ముఖ్యనాయకులు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ప్లకార్డులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బక్కని విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ వైకాపాకు సీఎం కాదని, ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి అని గుర్తుంచుకుని బుద్ధిగా పాలన చేయాలని హితవు పలికారు. తనకు న్యాయం జరగకపోతే నక్సలైట్లలో చేరాల్సి ఉంటుందని ఏపీకి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రపతికి విన్నవించుకున్నారంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. జోగి రమేష్‌ను, అతని అనుచరులను చంద్రబాబు ఇంటివరకు ఎలా అనుమతించారని పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని, ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా తెలంగాణ శాఖ లేఖలు రాసిందని మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని