ప్రాథమిక వైద్యం బలోపేతానికి రూ.2,228 కోట్లు

ప్రధానాంశాలు

ప్రాథమిక వైద్యం బలోపేతానికి రూ.2,228 కోట్లు

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు
ఐదేళ్లలో విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాథమిక వైద్యం బలోపేతానికి 15వ ఆర్థిక సంఘం రూ.2,228 కోట్ల నిధులను కేటాయించింది. 2021-26 మధ్య కాలంలో విడుదల చేయనున్న ఈ నిధులను పూర్తిగా సాయం(గ్రాంట్లు) రూపంలోనే అందించనున్నారు. ఇందులో గ్రామీణ వైద్యానికి రూ.1,472 కోట్లు, పట్టణ ప్రాథమిక వైద్యానికి రూ.756 కోట్లను కేటాయించింది. ఐదేళ్లలో విడతల వారీగా ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తారు. వైద్యరంగం అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం నిధుల్లో మూడింట రెండొంతులు ప్రాథమిక వైద్యానికి ఖర్చు చేయాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం బడ్జెట్‌లో 8 శాతం నిధులను వైద్యఆరోగ్య రంగానికి కేటాయించాలని సూచించింది. 15వ ఆర్థిక సంఘం కేటాయిస్తున్న నిధులను వేటికి ఖర్చు చేయాలో కూడా స్పష్టీకరించింది. ప్రధానంగా గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దేందుకు.. పట్టణాల్లో బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు నిధులు ఉపయోగించాల్సి ఉంటుంది.ఈ నిధుల వ్యయానికి పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

మండలం ఒక యూనిట్‌గా అభివృద్ధి: సీఎస్‌

15వ ఆర్థిక సంఘానికి పంపే ప్రతిపాదనలపై చర్చించేందుకు మంగళవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యఆరోగ్యశాఖ తరఫున ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతమున్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ఠ పర్చడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్నింటిని మండల పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్లుగా అభివృద్ధి చేయాలని సీఎస్‌ సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, పురపాలక, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్లు సత్యనారాయణ, వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని