ఆ అలవాటు ఇంటి నుంచే మొదలుపెడదాం! - Eco Friendly Habits on the occasion of world environment conservation day
close
Updated : 28/07/2021 20:32 IST

ఆ అలవాటు ఇంటి నుంచే మొదలుపెడదాం!

‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ‘ప్రకృతికి కోపం రాకూడదు... వస్తే మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చట అది తీర్చుకుంటుంది’ అనే డైలాగు ఉంటుంది. ఈరోజుల్లో మనం చేసే పనులు ఎక్కువగా ప్రకృతి కోపానికి గురయ్యే విధంగానే ఉంటున్నాయి. వీటిలో ప్లాస్టిక్‌ వినియోగం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చెట్లు నరకడం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇలా చేజేతులా పర్యావరణ కాలుష్యం సృష్టించడమే కాదు.. నివారించడమూ మన చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని అలవాట్లు పాటించడం ఇంటి నుంచే ప్రారంభించమంటున్నారు. ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’ సందర్భంగా పర్యావరణహితం కోసం ఇంటి నుంచే మొదలుపెట్టాల్సిన ఆ అలవాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మొక్కలతో ఇంట్లోనే ఆనందం!

పెరుగుతోన్న కాలుష్యాన్ని చూస్తుంటే స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కునే పరిస్థితులొస్తాయేమో అనిపించకమానదు. మొన్న రెండో దశ కరోనా విజృంభణ సమయంలో ఇది నిరూపితమైంది కూడా! ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి నేర్చుకొన్న పాఠాలను ఇప్పటికే చాలామంది ఒంటబట్టించుకున్నారు. ఇందులో భాగంగానే ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకునే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఛాలెంజ్‌ తీసుకోవడంతో పాటు మహిళలు కూడా ఇంటి బాల్కనీల్లో, కిచెన్‌ బాల్కనీల్లో ఇంటి అవసరాలకు ఉపయోగపడే మొక్కల్ని పెంచడం, ఇంటి లోపల పెంచుకునే మొక్కలకు ప్రాధాన్యమివ్వడం వంటివి చేస్తున్నారు. తద్వారా స్వచ్ఛమైన గాలి కోసం, పచ్చదనం కోసం ఎక్కడో ఉన్న పార్కుకు వెళ్లే ప్రయాస తప్పుతుంది. ఇప్పటికే చాలా ఇళ్లలో మొదలైన ఈ గ్రీన్‌ ఉద్యమం మిగతా ఇళ్లలోనూ ప్రారంభమైతే భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యాన్ని అందించినవారమవుతాం.. రాబోయే ప్రకృతి విపత్తుల్నీ తప్పించిన వారమవుతాం..!

నడిస్తే పోలా?!

ఈరోజుల్లో చాలామంది బండి లేనిదే బయటకు కదలడం లేదు. నడిచే దూరానికి కూడా స్కూటీ వేసుకెళ్తున్నారు. దాంతో వాటి నుంచి వచ్చే పొగ గాల్లో కలుస్తోంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఇదీ ఒకటని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటును తగ్గించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. దగ్గర్లోని కిరాణా షాపుకు/కాయగూరల మార్కెట్‌కు వెళ్లాలంటే ఆడుతూ పాడుతూ వెళ్లి రావచ్చు. ఇంకాస్త దూరమైతే సైకిల్‌ వేసుకెళ్లచ్చు. దీని వల్ల వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. అలాగే చాలామంది మహిళలు తమకు వ్యాయామం చేయడానికి సమయమే కుదరట్లేదు అంటుంటారు. ఇలా నడక, సైక్లింగ్‌ వల్ల శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది. అలాంటప్పుడు ప్రత్యేకించి దీని కోసం సమయం కేటాయించడం ఎందుకు?!

ప్లాస్టిక్‌ వద్దు.. జ్యూట్‌ ముద్దు!

బజారుకు వెళ్లి సరుకులు/కూరగాయలు తేవాలంటే 100లో 99 శాతం మంది వాడేవి ప్లాస్టిక్‌ కవర్లు/సంచులే! అలాగే ప్లాస్టిక్‌ డబ్బాలు లేని కిచెన్‌ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఇలా ప్లాస్టిక్‌కి మనం బానిసలుగా మారిపోయాం. అలాగని వీటిని ఒక్కసారిగా దూరం పెట్టడమంటే కుదరకపోవచ్చు.. కానీ క్రమంగా వీటి వాడకం తగ్గించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. సాధారణంగానైతే కనీసం 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు/షీట్లు/డబ్బాలైతే రీసైక్లింగ్‌ చేసి తిరిగి వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి వాటిని అత్యవసరమైతేనే వాడాల్సి ఉంటుంది. ఇక సరుకుల కోసం ప్లాస్టిక్‌ కవర్‌కి బదులు పర్యావరణహిత జ్యూట్‌ బ్యాగ్‌/పేపర్‌ బ్యాగ్‌.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వచ్చు. ఇక కిచెన్‌లో కూడా గాజు సీసాలు, స్టీల్‌ డబ్బాల ఉపయోగాన్ని పెంచచ్చు. ఇలా క్రమంగా ప్లాస్టిక్‌ని దూరం పెట్టుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు పర్యావరణహిత వనరులతోనే సర్దుకోవడమెలాగో అలవాటైపోతుంది. ఈ అలవాటు అటు ప్రకృతికి, ఇటు మనకూ మంచి చేస్తుంది.

వృథా అన్నదే ఎంతోమంది కడుపు నింపుతుంది!

ఇంట్లో అన్నం, కూరలు ఎక్కువ మొత్తంలో వండడం, మరుసటి రోజు మిగిలిన వాటిని వృథాగా పడేయడం చాలామందికి అలవాటు! నిజానికి ఇలా వృథాగా పడేసే బదులు అవసరంలో ఉన్న వారికి అందించచ్చు కదా అన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. దీనివల్ల ఇతరుల కడుపు నింపామన్న సంతృప్తే కాదు.. పర్యావరణానికీ మంచి చేసిన వారమవుతారంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనం వృథాగా పడేసే ఆహారం భూమిలోకి చేరి మీథేన్‌ వాయువు విడుదలకు కారణమవుతుందట! ఇది కార్బన్‌ డై ఆక్సైడ్‌ కంటే శక్తిమంతమైన గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌.. కాబట్టి దీనివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత మరింతగా పెరుగుతుంది. ఇలా జరగడం మనకు, పర్యావరణానికీ నష్టమే.. కాబట్టి మన చేజేతులా పర్యావరణానికి హాని కలిగించడం మానుకొని ఎంత అవసరమో అంతే వండుకోవడం, ఒకవేళ మిగిలితే అవసరార్థుల కడుపు నింపడం మంచి పద్ధతి. మరో విషయమండోయ్‌.. కిచెన్‌లో వంట చేసే క్రమంలో కాయగూరల వ్యర్థాలను వృథాగా పడేయకుండా ఎరువులుగా మార్చి ఇంట్లోని మొక్కలకు ఉపయోగించచ్చు.

ప్యాడ్స్‌ కంటే కప్స్‌ మేలు!

నెలసరి సమయంలో మనం ఉపయోగించే శ్యానిటరీ న్యాప్‌కిన్లు కూడా పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అందుకే వీటికి బదులు వాతావరణానికి మేలు చేసే బయోడిగ్రేడబుల్‌ ప్యాడ్స్‌, తిరిగి ఉపయోగించుకునే మెన్‌స్ట్రువల్‌ కప్స్‌.. వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించడం వల్ల లీకేజీ సమస్య ఉంటుందేమోనన్న అపోహతో ఇప్పటికీ చాలామంది వీటిని దూరం పెడుతున్నారు. కానీ నిజానికి బయట దొరికే ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారుచేసే శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వల్లే వివిధ రకాల ప్రత్యుత్పత్తి సమస్యలు, ఇన్ఫెక్షన్లు తలెత్తుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ప్యాడ్స్‌ కంటే పర్యావరణహితమైన కప్స్‌ ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో రియలైజ్‌ అయి మార్పు తెచ్చుకుంటే మంచిది.

ఇవి కూడా!

* తడి చెత్త కోసమైనా, పొడి చెత్త కోసమైనా ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌/కవర్స్‌ కంటే బయోడిగ్రేడబుల్‌ ట్రాష్‌ బ్యాగ్స్‌ని ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవైతే వంద శాతం మట్టిలో కలిసిపోతాయంటున్నారు.

* షాంపూ, కండిషనర్‌, లోషన్‌.. వంటి బ్యూటీ ఉత్పత్తులు కొన్న ప్రతిసారీ బాటిల్స్‌ రూపంలో కాకుండా.. ప్యాకెట్స్‌లో తెచ్చుకొని తిరిగి వీటిలో నింపుకుంటే చాలావరకు కాలుష్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* బయటికి వెళ్లినప్పుడు నీళ్ల సీసాలు కొని.. తాగాక చెత్తకుండీలో పడేయడం చాలామందికి అలవాటు! అదే ఇంటి నుంచే నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లి దాన్ని తిరిగి ఉపయోగించుకుంటే ప్లాస్టిక్‌ వృథాకు చాలా వరకు చెక్‌ పెట్టచ్చు.

* ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేయడానికి, ఇతర అవసరాల కోసం వాడి పడేసే పేపర్‌ టవల్స్‌ కంటే తిరిగి ఉపయోగించే పాత టవల్స్‌, ఇతర దుస్తుల్ని ఉపయోగించడం శ్రేయస్కరం!

* రసాయనాలు, పారాబెన్స్‌, థాలేట్స్‌.. వంటివి ఉపయోగించి తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులతో అటు చర్మానికి, ఇటు పర్యావరణానికి.. రెండింటికీ నష్టమే! కాబట్టి వాటికి బదులుగా వంద శాతం సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులు, ఇంట్లో తయారుచేసిన సౌందర్య సాధనాలు.. వంటివి వాడడం ఉత్తమం.

ఇలా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ పర్యావరణహితం కోరుకోవచ్చు.. వాతావరణానికి మేలు చేసే అలవాట్లనే అలవర్చుకోవచ్చు. మరి, ఇవి కాకుండా పర్యావరణహితం కోసం ఇంకా ఎలాంటి అలవాట్లను పాటించచ్చంటారు? ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవడం మేలంటారు? ఇంతకీ మీ ఎకో-ఫ్రెండ్లీ అలవాట్లేంటి? మాతో పంచుకోండి. పర్యావరణ పరిరక్షణ దిశగా అందరిలో ప్రేరణ కల్పించండి..!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని