కిచెన్ చిమ్నీ శుభ్రం చేస్తున్నారా? - easy ways to clean greasy kitchen chimneys
close
Published : 08/07/2021 19:40 IST

కిచెన్ చిమ్నీ శుభ్రం చేస్తున్నారా?

ఇంట్లో ఎక్కువ వేడిగా ఉండే గది ఏదంటే కిచెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వంట చేసే క్రమంలో వేడి, పొగ వెలువడడం మనకు తెలిసిందే. అయితే వీటిని బయటకు పంపించి ఆ గదిని చల్లగా ఉంచేందుకు కిచెన్ చిమ్నీలు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే ఈరోజుల్లో చాలామంది మాడ్యులర్ కిచెన్‌లో భాగంగా వాటిని నిర్మించుకోవడం లేదా వంటగదిలో ప్రత్యేకంగా చిమ్నీలు ఏర్పాటుచేసుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఆ చిమ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారా? అంటే.. చాలామంది తమకు అంత సమయం దొరకట్లేదనే సమాధానం ఇస్తారు. ఫలితంగా వంట చేసే క్రమంలో వెలువడే పొగతో పాటు ఆయిల్ మరకలు కూడా తోడై చిమ్నీ జిడ్డుగా మారిపోతుంది. ఈ క్రమంలో దాన్ని నిర్ణీత వ్యవధికోసారి శుభ్రం చేయకపోతే అందులోని ఫిల్టర్లు మూసుకుపోవడంతోపాటు చిమ్నీ, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఆయిల్ మరకలతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. కాబట్టి కనీసం రెండు వారాలకోసారైనా వాటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు.. సులభంగా లభించే కొన్ని పదార్థాలతోనే కిచెన్ చిమ్నీని శుభ్రం చేసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం రండి.

డిష్‌వాష్ లిక్విడ్‌తో...

గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి ఇంట్లో ఏదో ఒక డిష్‌వాష్ లిక్విడ్ ఉండనే ఉంటుంది. దాంతో కిచెన్ చిమ్నీని కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా చిమ్నీ నుంచి ఫిల్టర్లను వేరుచేసి వాటిపై డిష్‌వాష్ లిక్విడ్‌ను అప్త్లె చేయాలి. ఆపై ఒక బకెట్‌లో మరిగే నీళ్లు పోసి అందులో ఫిల్టర్లను వేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దితే ఫిల్టర్లకు అంటుకున్న జిడ్డు అంతా వదిలిపోతుంది. ఇది కష్టమనిపిస్తే.. ఒక పెద్ద పాత్రలో నిండా నీళ్లు పోసి అందులో చిమ్నీ ఫిల్టర్లను వేసి అరగంట పాటు మరిగించాలి. ఆపై వాటిని బయటకు తీసి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా వాటికున్న జిడ్డుదనాన్ని సులభంగా తొలగించవచ్చు. అలాగే చిమ్నీలోని ఇతర విడి భాగాలను కూడా ముందుగా డిష్‌వాష్ మిశ్రమంలో ముంచిన గుడ్డతో తుడిచి ఆపై నీటిలో ముంచి గుడ్డతో నెమ్మదిగా తుడిచి ఆరబెట్టాలి.

వెనిగర్‌తో..

ఇంట్లో వాడే సహజసిద్ధమైన క్లీనింగ్ ఉత్పత్తుల్లో వెనిగర్ కూడా ఒకటన్న విషయం మనకు తెలిసిందే. దీంతో కిచెన్ చిమ్నీని సులభంగా శుభ్రం చేయచ్చు. ఇందుకోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో రెండు కప్పుల వెనిగర్, జిడ్డుగా మారిన చిమ్నీ ఫిల్టర్లను వేసి అరగంట పాటు మరిగించాలి. ఆపై వాటిని బయటకు తీసి స్క్రబ్బర్‌తో రుద్దితే వాటికున్న జిడ్డు సులభంగా వదిలిపోతుంది. అలాకాకుండా మరిగించిన నీటిలో వెనిగర్ వేసి ఆ మిశ్రమంలో ఫిల్టర్లను రెండు గంటల పాటు నానబెట్టి శుభ్రం చేసినా సరిపోతుంది. ఇక చిమ్నీలోని ఇతర విడిభాగాలను వెనిగర్ మిశ్రమంతో ముంచిన క్లాత్‌తో జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆపై మంచి నీటిలో ముంచిన గుడ్డతో నెమ్మదిగా తుడిచి, పొడి వస్త్రంతో శుభ్రం చేసి ఆరనీయాలి.

నెయిల్ పాలిష్ రిమూవర్‌తో..

గోళ్ల రంగును తొలగించుకోవడానికి ఉపయోగించే నెయిల్ పాలిష్ రిమూవర్, నేలపై పడిన పెయింట్ మరకల్ని తొలగించడానికి ఉపయోగించే పెయింట్ థిన్నర్.. వంటి వాటితోనూ కిచెన్ చిమ్నీని, అందులోని ఫిల్టర్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం చిన్న బౌల్‌లో కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ లేదా పెయింట్ థిన్నర్ తీసుకొని అందులో ఒక చిన్న క్లాత్‌ని వేసి కాసేపు నానబెట్టాలి. ఈ బౌల్‌పై మూతపెట్టడం మరిచిపోకూడదు. ఆ తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్‌లో బాగా నానిన క్లాత్‌తో శుభ్రం చేయాలనుకున్న చిమ్నీ ఫిల్టర్లపై, ఇతర విడి భాగాలపై రుద్దాలి. ఆపై వాటిని నీటితో కడిగి ఆరబెడితే సరిపోతుంది.

ఈ మిశ్రమంతో..

జిడ్డు, ఏ ఇతర మరకల్ని తొలగించడానికైనా మనం ఎక్కువగా ఉపయోగించే పదార్థం బేకింగ్ సోడా. అందుకే కిచెన్‌లో ఇది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దీంతో కూడా కిచెన్ చిమ్నీని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా ఒక బకెట్‌లో మరిగిన నీళ్లు తీసుకొని అందులో రెండు కప్పుల వెనిగర్, మూడు టేబుల్‌స్పూన్ల చొప్పున బేకింగ్ సోడా, ఉప్పు వేయాలి. ఇప్పుడు చిమ్నీ ఫిల్టర్లను ఈ నీటిలో వేసి దాదాపు రెండు గంటల పాటు నాననివ్వాలి. ఆపై వీటిని బయటకు తీసి స్క్రబ్బర్‌తో రుద్దితే వాటికున్న జిడ్డు, ఇతర మరకలు కూడా తొలగిపోయి అవి కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఇదే మిశ్రమంతో చిమ్నీ విడిభాగాలను కూడా శుభ్రం చేయచ్చు. ఇందుకోసం ఈ మిశ్రమంలో ముంచిన పరిశుభ్రమైన క్లాత్‌తో వాటిని తుడిచి ఆపై శుభ్రమైన నీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి. ఇప్పుడు పొడి గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.

క్యాస్టిక్ సోడా..

మార్కెట్లో లభించే క్యాస్టిక్ సోడా సహాయంతోనూ కిచెన్ చిమ్నీని మెరిపించవచ్చు. ఇందుకోసం చిమ్నీలో జిడ్డుగా మారిన ఫిల్టర్లను బయటికి తీసి వాటిని ఒక పెద్ద ట్రేలో ఉంచాలి. వాటిపై నుంచి క్యాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్)ను చల్లి, అవి మునిగేంత వరకు బాగా మరిగించిన నీళ్లు పోయాలి. ఇలా చేసే క్రమంలో పొగలు రావడం మనం గమనించవచ్చు. కనీసం రెండు మూడు గంటల పాటు వాటిని బాగా నాననిచ్చి ఆపై బయటకు తీసి వీటిని స్క్రబ్బర్ సహాయంతో రుద్దితే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే నీటిలో కలిపిన క్యాస్టిక్ సోడా మిశ్రమంలో ముంచిన క్లాత్‌తో చిమ్నీలోని ఇతర భాగాలను తుడిచి, ఆపై శుభ్రమైన నీటిలో ముంచి పొడి క్లాత్‌తో తుడిస్తే చిమ్నీ కొత్తదానిలా మెరిసిపోతుంది.

కిచెన్‌లో జిడ్డుగా మారిన చిమ్నీ ఫిల్టర్లను, దానిలోని ఇతర విడిభాగాలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నారు కదా..! అయితే ఈ చిట్కాల్లో మీరు ఏది పాటించినా చేతులకు గ్లౌజులు ధరించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే అయినా అందరి చర్మతత్వాలకు సరిపడకపోవచ్చు. అలాగే చిమ్నీలోని విడిభాగాల్లోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తగా వాటిని శుభ్రం చేయాలన్న విషయం మర్చిపోవద్దు. ఇలా చేస్తే అది పరిశుభ్రంగా మెరిసిపోవడంతో పాటు ఎక్కువ కాలం కూడా మన్నుతుంది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని