బెస్ట్ ఫ్రెండ్‌తోనే ఏడడుగులు నడిచింది! - evelyn sharma marries boyfriend tushan bhindi in australia in intimate ceremony
close
Published : 24/06/2021 12:54 IST

బెస్ట్ ఫ్రెండ్‌తోనే ఏడడుగులు నడిచింది!

Photos: Instagram

ఎవరైనా తమ జీవిత భాగస్వామి బెస్ట్‌ ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటారు. మరి ఆ బెస్ట్‌ ఫ్రెండే ‘భాగస్వామి’ అయితే... అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుందంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవ్‌లీన్‌ శర్మ. ‘సాహో’ సినిమాతో తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితమైన ఈ సొగసరి ఇటీవల తన స్నేహితుడు తుషాన్‌ బిండీని వివాహం చేసుకుంది. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆమె తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

డాక్టర్‌తో కలిసి ఏడడుగులు!

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వరసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలున్నప్పటికీ అతి తక్కువమంది అతిథుల సమక్షంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా జీవితంలో తమ కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. మొన్న ప్రణీత, నిన్న యామీ గౌతమ్‌ ఇలాగే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఎవ్‌లీన్‌ శర్మ కూడా అదే దారిలో నడిచింది. తన స్నేహితుడు, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ బిండీతో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ వేదికగా అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.

‘యే జవానీ హై దివానీ’తో గుర్తింపు!

జర్మనీకి చెందిన ఎవ్‌లీన్‌ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించింది. 2012లో ‘ఫ్రం సిడ్నీ విత్‌ లవ్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. రణ్‌బీర్‌ కపూర్‌, దీపికతో కలసి నటించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇషాక్‌’, ‘యారియాన్‌’, ‘మై తేరా హీరో’, ‘కుచ్‌ కుచ్‌ లోచా హై’, ‘గద్దర్‌’ తదితర సినిమాలతో హిందీ సినీ ప్రియులకు బాగా చేరువైంది. ఇక ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌ను కూడా పలకరించింది. ఎవ్‌లీన్‌ చివరిగా 2019లో ‘కిస్సేబాజ్‌’ అనే చిత్రంలో కనిపించింది.

అలా మొదలైంది!

ఎవ్‌లీన్‌ భర్త తుషాన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దంత వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక వీరి ప్రేమకథ విషయానికొస్తే... 2018లో ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో మొదటిసారి కలుసుకున్నారు ఎవ్‌లీన్‌-తుషాన్‌. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి...ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. ఈ క్రమంలో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ 2019 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి వేదికగా రొమాంటిక్‌గా ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక దాంపత్య బంధంలోకి అడుగుపెడదామనుకున్న తరుణంలో కరోనా వీరి ప్రణాళికలకు అడ్డుపడింది. అప్పటి నుంచి వీరి వివాహం వాయిదా పడుతూనే ఉంది.

అమ్మ కూడా నా పెళ్లి చూడలేకపోయింది!

అయితే ఇటీవల ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ వేదికగా పెళ్లిపీటలెక్కారు ఎవ్‌లీన్‌-తుషాన్‌. ఈ సందర్భంగా తమ వివాహంపై స్పందించిన ఎవ్‌లీన్‌ ‘బెస్ట్‌ ఫ్రెండ్‌ను జీవిత భాగస్వామిగా చేసుకోవడం కన్నా ఆనందకరమైన విషయం ఏముంటుంది? మా జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా మా వివాహం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... మా అమ్మ కూడా నా పెళ్లి చూడలేకపోయింది. అయితే ఆమె ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వారి దీవెనలన్నీ మాకు ఉండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చింది.

తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలన్నీ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ఎవ్‌లీన్‌. ఈ సందర్భంగా వైట్‌ కలర్‌ లేస్‌ గౌన్‌లో ఎవ్‌లీన్‌ ఎంతో అందంగా కనిపించగా, బ్లూ కలర్‌ సూట్‌లో సూపర్బ్‌ అనిపించాడు తుషాన్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సొనాల్‌ చౌహాన్‌, క్రిస్టెల్‌ డిసౌజా లాంటి సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి దాంపత్య జీవితం బాగుండాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని