బీడీ ఆకులు తెంచిన చేతులే... భవితను దిద్దుతున్నాయి
close
Published : 23/03/2021 01:11 IST

బీడీ ఆకులు తెంచిన చేతులే... భవితను దిద్దుతున్నాయి

రోజంతా కూలి పనిచేసినా...ఒక పూట భోజనం కోసం వెతుక్కునే కుటుంబం ఆమెది.  రెండు పూటలా తినడం కోసం సాంఘిక సంక్షేమ వసతి గృహంలోకి అడుగుపెట్టిన మాయ... చదువులో బంగారు పతకాలు సాధించింది.  ఆ రోజు ఏం చేస్తే చదువుకోగలను అని ఆలోచించిన ఆమె ఈ రోజు బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా విద్యార్థులకు సిలబస్‌ నిర్ణయిస్తోంది.  ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న మాయాదేవి  జీవితం ఆద్యంతం ఆసక్తిదాయకం.
‘కూలీ కూతురు పెద్ద ఆఫీసరైందని అందరూ గొప్పగా చెప్పుకోవాలి... నువ్వు తిన్నావోలేదో ఎవరూ చూడరు. ఎలా ఎదిగావన్నదే చూస్తారు...’ అంటూ చిన్నతనంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆమె విజయానికి తారక మంత్రంలా పనిచేశాయి.  ఆ స్ఫూర్తితో అడుగులేసిన మాయాదేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ హిందీ విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) ఛైర్‌పర్సన్‌గానూ ఉన్నారు.  
నివర్తి మాయాదేవి సొంతూరు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి. తండ్రి నివర్తి వాగ్‌బిజే హమాలీ. తల్లి సునంద వ్యవసాయ కార్మికురాలు. ఆరుగురు సంతానంలో మాయే పెద్దది. అమ్మానాన్నలకు పని దొరికితేనే ఆ పిల్లల కడుపు నిండేది. వారిద్దరూ రోజంతా కష్టపడినా... కుటుంబ అవసరాలకు ఆ మొత్తం సరిపోయేది కాదు. దాంతో ఒక పూటే తిని కాలే కడుపుతో పడుకున్న రోజులే ఎక్కువ. ఈ పరిస్థితులు తనని ఆలోచనలో పడేశాయి. అందుకే ఇంటికి ఆసరాగా ఉండాలనుకుంది. చదువుకుంటూనే బీడీ ఆకులు తెంపేందుకు వెళ్లేది. రోజుకు పదిహేను రూపాయల కూలీ ఇచ్చేవారు. ఇలా పదో తరగతికి వచ్చేవరకూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచింది.

పదోతరగతి ఫెయిలై... మాయ కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ, బాధ్యతల్లో పడి చదువుమీద దృష్టి పెట్టలేకపోయింది. దాంతో బాగా చదివే అమ్మాయి కాస్తా పదోతరగతి ఫెయిల్‌ అయ్యింది. ‘ఇంకేం చదువు.. పెళ్లి చేసేస్తేపోలా..’ అన్నారు చుట్టుపక్కల వాళ్లు. కానీ నాన్న, బడిలో టీచర్లు చదువుకుంటేనే కానీ భవిష్యత్తు ఉండదన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే  నువ్వు అనుకున్నది సాధించగలవని నమ్మకాన్ని నూరిపోశారు. అప్పుడు మళ్లీ పరీక్షలు రాసి పాసైంది.  
ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తూ... ఇంటర్‌లో చేరాలనుకున్నా...ఆర్థిక పరిస్థితులు అడ్డుపడ్డాయి. అప్పుడే ఆమెకు రెసిడెన్షియల్‌ కాలేజీ ఎంట్రన్స్‌ పరీక్ష గురించి తెలిసింది. అందులో సీటు వస్తే రెండు పూటలా భోజనం పెట్టి ఆశ్రయం ఇస్తారు. చదువుకు ఏ ఇబ్బందీ ఉండదనుకుని కష్టపడి ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సీటు వచ్చిందామెకు. అక్కడే ఉంటూ... ఇంటర్‌ పూర్తిచేసింది. ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తూ హిందీ మహావిద్యాలయలో డిగ్రీ చదివింది. ఆపై సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి హిందీలో ఎంఏ పట్టాపొందింది. టాపర్‌గా రెండు స్వర్ణ పతకాలను అప్పటి గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిందే చేతుల మీదుగా అందుకుంది. ఇవన్నీ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఆపై ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగానూ ఎంపికైంది. తండ్రికి ఆసరాగా నిలిచింది. మిగిలిన పిల్లల చదువులపై దృష్టిపెట్టింది. క్రమంగా ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది.
ఇప్పుడు విభాగాధిపతిగా... మాయకు ఆదిలాబాద్‌కు చెందిన భరత్‌ వాగ్మారేతో వివాహమైంది. భర్త సలహాతో ఉద్యోగానికి సెలవుపెట్టి ఎంఫిల్‌, తర్వాత పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యింది మాయాదేవి. ఆపై హిందీ విభాగాధిపతిగానూ పదోన్నతి పొందింది. ఇప్పుడు బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) ఛైర్‌పర్సన్‌ కూడా. అంటే తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో హిందీ విభాగంలో సిలబస్‌ నిర్ణయం, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో ఆమెదే కీలకపాత్ర. పైగా వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఆ విభాగాధిపతిగా ఎదిగిన తొలి దళిత మహిళగానూ మాయాదేవి రికార్డు సృష్టించింది. తండ్రి మరణం తర్వాత కుటుంబ పెద్దగా చెల్లెళ్లు, తమ్ముడి బాధ్యతలనూ తీసుకుంది. పదిహేను రూపాయల కోసం కూలికి వెళ్లిన ఆమే...ఇప్పుడు లక్షన్నర రూపాయల జీతం అందుకుంటోంది.

- ఎం.మణికేశ్వర్‌, ఈనాడు-ఈటీవీ ఆదిలాబాద్‌

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి