Makeup Kit : ఏవి అవసరం? ఏవి అనవసరం? - makeup essentials and non essentials in your kit in telugu
close
Published : 27/09/2021 15:29 IST

Makeup Kit : ఏవి అవసరం? ఏవి అనవసరం?

మేకప్‌.. ఇప్పుడు చాలామంది అమ్మాయిల నిత్యకృత్యంగా మారిపోయింది. ఇష్టమనో లేదంటే వృత్తిపరంగానో మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుకునే వారే ఎక్కువమంది! అయితే మేకప్‌ అంటే కిట్‌లో అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు ఉండాలా? ఖర్చుకు వెనకాడకుండా ప్రతిదీ కొనేయాలా? అంటే అవసరం లేదంటున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని ప్రాథమిక, అత్యవసర మేకప్‌ వస్తువులుంటే సరిపోతుందంటున్నారు. తద్వారా పర్సు ఖాళీ కాకుండా చూసుకోవడంతో పాటు అనవసర మేకప్‌ ఉత్పత్తులతో అందం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ మేకప్‌ కిట్‌లో అవసరమైన, అనవసరమైన వస్తువులేంటో తెలుసుకుందాం రండి..

అందుకే ఇవి ఉండాల్సిందే!

* మేకప్‌ వేసుకునే క్రమంలో ఫౌండేషన్‌ని ఉపయోగించడం మామూలే! అయితే దీనికంటే మెరుగైన ఫలితం మాయిశ్చరైజర్‌ ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇది చర్మానికి తేమనందించడంతో పాటు సహజసిద్ధమైన లుక్‌ని అందిస్తుంది. ఈ క్రమంలో బయట దొరికే మాయిశ్చరైజర్‌ క్రీమ్స్‌ అయినా ఎంచుకోవచ్చు.. లేదంటే ఇంట్లో ఉండే షియా బటర్‌, కొబ్బరి నూనె వంటివి వాడచ్చు. తద్వారా ఖర్చూ కలిసొస్తుంది.

* అలాగే సింపుల్‌ మేకప్‌ లుక్‌ని సొంతం చేసుకోవాలనుకునే వారి మేకప్‌ కిట్‌లో ఓ ప్రైమర్‌, టాల్కం పౌడర్‌ ఉంటే సరిపోతుంది.

* మేకప్‌ వేసుకున్నా వేసుకోకపోయినా కంటికి కాటుక, కనురెప్పలకు మస్కారా పెట్టుకొని ఇదే తమ మేకప్‌ లుక్‌ అని మెరిసిపోతున్నారు ఈ తరం అమ్మాయిలు. మీరూ అంతేనా? అయితే ఇతర మేకప్‌ ఉత్పత్తులు మీ మేకప్‌ కిట్‌లో ఉన్నా, లేకపోయినా ఈ రెండూ మాత్రం ఉండాల్సిందే!

* మేకప్‌ ఉత్పత్తుల వల్ల కళ కోల్పోయిన చర్మానికి తిరిగి ప్రాణం పోయడంలో నైట్‌ క్రీమ్‌ పాత్ర కీలకం! ఇది పొడిబారిన చర్మానికి తేమనందించడంతో పాటు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తప్రసరణనూ మెరుగుపరుస్తుంది. తద్వారా చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

* అలసిన కళ్లకు సాంత్వన చేకూర్చడంలో ఐ క్రీమ్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. ఇవి కంటి చుట్టూ నల్లటి వలయాలు, కళ్ల కింద వాపు, ముడతలు, గీతల్ని తగ్గించి.. కంటి కళ తగ్గకుండా చేస్తాయి. కాబట్టి దీన్ని మీ కిట్‌లో చేర్చుకోవడంతో పాటు ఉదయాన్నే బయటికి వెళ్లే ముందు అప్లై చేసుకోవడం మంచిది.

* కంటి మేకప్‌లో భాగంగా ఐల్యాష్‌ కర్లర్‌, మస్కారా వంటివి ఉపయోగిస్తుంటాం. వాటిలోని రసాయనాల ప్రభావం కనురెప్పలపై పడకుండా ఉండాలంటే ఐల్యాష్‌ కండిషనర్‌ తప్పనిసరిగా వద్ద ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి కనురెప్పలకు తేమను, దృఢత్వాన్ని అందిస్తాయి. దీన్ని ఉదయం, రాత్రి.. అంటే మేకప్‌కు ముందు, మేకప్‌ తొలగించుకున్నాక.. ఇలా రెండుసార్లు అప్లై చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందచ్చంటున్నారు.

* అమ్మాయిల మేకప్‌ కిట్‌లో ఏది ఉన్నా, లేకపోయినా లిప్‌స్టిక్‌ మాత్రం తప్పకుండా ఉంటుంది. చాలామంది దీన్ని హ్యాండ్‌బ్యాగ్స్‌లో క్యారీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది కూడా మరీ పెద్దది కాకుండా చిన్న సైజుల్లో ఉన్నది ఎంచుకోవడం మంచిది. తద్వారా ఎప్పటికప్పుడే తాజాగా మార్చేసుకోవచ్చు. దీంతో పాటు ఓ లిప్‌బామ్‌ కూడా వెంట ఉంచుకోవాలి. ఇది పెదాలకు తేమనందిస్తుంది.

* తక్కువ ధరకు లభిస్తూ.. అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేసే వస్తువుల్లో నెయిల్‌ పాలిష్‌ ఒకటి. కాబట్టి మీకు నచ్చిన, నప్పిన రంగు నెయిల్‌ పాలిష్‌ను కిట్‌లో ఉంచుకోవడం/వెంట తీసుకెళ్లడంలో తప్పు లేదు.

* మేకప్‌ వేసుకోవడమే కాదు.. తొలగించడమూ తప్పనిసరి. కాబట్టి ఓ మేకప్‌ రిమూవర్‌ కూడా కిట్‌లో తప్పకుండా ఉండాల్సిన వస్తువే! లేదంటే మిసెల్లార్‌ వాటర్‌ ఉపయోగించినా సమాన ఫలితం ఉంటుంది.

ఏవి అనవసరం?

* మేకప్‌ వేసుకునే క్రమంలో ప్రైమర్‌, కన్సీలర్‌, బ్లష్‌, హైలైటర్‌.. ఇలా చాలా ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. అయితే వీటన్నింటికి బదులుగా కాస్త ప్రైమర్‌ రాసుకొని సాధారణ టాల్కమ్‌ పౌడర్‌ వేసుకున్నా మంచి లుక్‌ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

* వెంటనే ఉపయోగించే విధంగా ఫేస్‌మాస్కుల్ని కొంతమంది బయటి నుంచి కొనుగోలు చేస్తారు. నిజానికి వాటి కంటే ఎవరి చర్మతత్వాలకు అనుగుణంగా వారు వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవడం వల్ల చర్మానికి హాని కలగదు. ఖర్చూ కలిసొస్తుంది.

* బరువు తగ్గిన వారు, బాలింతలకు చర్మంపై స్ట్రెచ్‌మార్క్స్‌ రావడం సహజమే! అయితే ఇందుకోసం యాంటీ-స్ట్రెచ్‌మార్క్స్‌ క్రీమ్‌ కొనాల్సిన అవసరం లేదు. దానికి బదులు కొకోవా బటర్‌, పెట్రోలియం జెల్లీ, మాయిశ్చరైజర్‌.. వంటివీ సమాన ఫలితాల్నిస్తాయంటున్నారు నిపుణులు.

* కంటికి కాటుకే అందం.. కాబట్టి అదొక్కటి కిట్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇక మరీ అత్యవసరం కాకపోతే ఐషాడో, ఐలైనర్‌, ఐబ్రో ఉత్పత్తులు.. వంటివన్నీ కొనకపోవడమే మంచిది. తద్వారా వాటిలోని రసాయనాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తపడచ్చు. దాంతో పాటు ఖర్చూ తగ్గించుకోవచ్చు.

* వేలకు వేలు పోసి హెయిర్‌ మాస్కులు, హెయిర్‌ క్రీమ్‌, హెయిర్‌ వ్యాక్స్‌, హెయిర్‌ జెల్‌, హెయిర్‌ స్ప్రే.. వంటివి కొనాల్సిన అవసరమే లేదు. వాటికి బదులుగా జుట్టుతత్వానికి సరిపడే నాణ్యమైన షాంపూ, కండిషనర్‌ ఉంటే సరిపోతుంది. ఇక కేశాలకు తేమనందించడానికి కొబ్బరి నూనె, ఇంట్లో తయారుచేసుకునే హెయిర్‌ మాస్కులు.. వంటి సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి.

ఇలా మీ అవసరాలకు అనుగుణంగా మీరు ఏ మేకప్‌ ఉత్పత్తి ఎంచుకున్నా సరే.. అది నాణ్యమైనదైతేనే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా అందాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో మీకేమైనా సందేహాలున్నా, సలహాలు కావాలన్నా నిపుణుల్ని అడగడానికి వెనకాడకండి. అలాగే మీ మేకప్‌ కిట్‌లో ఉన్న వస్తువుల ఎక్స్‌పైరీ తేదీని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకొని వాటిని మార్చుకోవడం మర్చిపోవద్దు.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని