ఉమ్మడి కుటుంబం.. పిల్లలకెన్ని ప్రయోజనాలో! - positive effects of the joint family on your child in telugu
close
Published : 07/08/2021 17:26 IST

ఉమ్మడి కుటుంబం.. పిల్లలకెన్ని ప్రయోజనాలో!

వృత్తి ఉద్యోగాల రీత్యా, ప్రైవసీ కొరవడుతుందని, స్వేచ్ఛగా ఉండలేమని.. ఇలా కారణాలేవైనా ఉమ్మడి కుటుంబంలో కంటే వేరుగా ఉండడానికే చాలా జంటలు ఆసక్తి చూపుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం అందరితో కలిసున్నప్పుడే ఆనందం రెట్టింపవుతుందని నమ్ముతారు. నిజానికి వేరుగా ఉండడం కంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే కొన్ని అదనపు ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలోని వాతావరణం పిల్లలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. అందుకే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరితో కలిసుండమని ఈ తరం జంటలకు సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి..

ఒంటరిగా ఫీలవ్వరు!

ఆర్థిక పరిస్థితుల రీత్యా లేదంటే బాధ్యతలు పెరిగిపోతాయనో.. అదీ కాదంటే సామాజిక స్పృహతోనో.. ఇలా కారణమేదైనా ప్రస్తుతం చాలా జంటలు ‘మేమిద్దరం.. మాకొక్కరు చాలు!’ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అంటే.. ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారన్నమాట! ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే అయినా.. ఇలాంటి చిన్నారుల్లో ఎక్కువ శాతం మంది ఒంటరితనానికి లోనవుతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం, వాళ్లతో ఆడుకునే వారెవరూ లేకపోవడం, ఒక్కగానొక్క సంతానం అని అతిగారాబంతో పిల్లల్ని బయటికి వెళ్లనివ్వకపోవడం.. వంటి కారణాలే ఈ ఒంటరితనానికి కారణమవుతాయంటున్నారు. అదే ఉమ్మడి కుటుంబంలో అయితే ఈ సమస్య రాదంటున్నారు. అక్కడైతే బాబాయి/పెదనాన్న పిల్లలు, కజిన్స్‌.. ఇలా ఒకే వయసులో ఉన్న వారంతా కలిసి ఆడుకుంటూ హ్యాపీగా గడిపేస్తారు. అంతేకాదు.. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత చదువుకోమన్నా చదువుకోని చిన్నారులు.. తమ కజిన్స్‌ని చూసి చదువుపై మక్కువనీ పెంచుకుంటారట!

కలివిడిగా.. వడివడిగా..!

ఈ కాలపు పిల్లలకు చదువే కాదు.. చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా అలవర్చడం తల్లిదండ్రుల బాధ్యత! అప్పుడే వారు భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతారు.. రాణించగలుగుతారు. ఒంటరిగా పెరిగే పిల్లల కంటే ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలకు ఇలాంటి లక్షణాలు, నైపుణ్యాలు సహజంగానే అలవడతాయంటున్నారు నిపుణులు. ఇంట్లో ఉండే పెద్దలతో ఎలా మాట్లాడాలి? గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం, కలుపుగోలుగా మెలగడం.. ఇవన్నీ వారికి ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదు. ఇంటి సభ్యుల్ని చూసి వాళ్లకు వాళ్లే నేర్చుకోగలుగుతారు.

వారి జీవితమే వీరికి పాఠం!

ఉమ్మడి కుటుంబంలో కాకుండా వేరుగా పెరిగే పిల్లలు తరచూ వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని మిస్సవుతుంటారు. రోజూ పడుకునే ముందు వాళ్లు చెప్పే నీతికథలు వినే అవకాశం కూడా వీరికి ఉండదు. అలాగని ఇవన్నీ పేరెంట్స్‌ చెప్తారా అంటే వాళ్లకు అంత సమయం ఉండదు. అదే అందరూ కలిసున్నప్పుడు ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు చిన్నారులకు బోలెడన్ని విషయాలు చెప్పే ఆస్కారం ఉంటుంది. లోకం పోకడ ఎలా ఉంటుంది? చిన్నతనం నుంచి వాళ్లు పడిన కష్టాలు, చదువుకొని ప్రయోజకులైన విధానం.. ఇలా వాళ్ల జీవితంలోని ప్రతి ఘట్టం నేటి పిల్లలకు జీవిత పాఠమే అవుతుంది. ఎప్పుడూ చదువే కాదు.. జీవితానికి సంబంధించిన ఇలాంటి విషయాలపై పిల్లలకు చిన్నతనం నుంచే ఓ అవగాహన ఏర్పర్చడం మరీ మంచిదంటున్నారు నిపుణులు.

మిమ్మల్నీ మిస్సవ్వరు!

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌ ఏమో కానీ కన్న పిల్లలతో కాసేపు సమయం గడిపే తీరికే తల్లిదండ్రులకు దొరకట్లేదు. దీంతో పిల్లలు తమ తల్లిదండ్రుల్ని చాలా మిస్సవుతుంటారు. దీని ప్రభావం పోనుపోను వారి చిన్ని మనసులపై పడే ప్రమాదం ఉంటుంది. అదే ఉమ్మడి కుటుంబాల్లో పేరెంట్స్‌ పిల్లల్ని, పిల్లలు పేరెంట్స్‌ని మిస్సవ్వరని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే.. మీకు మీరు వేరుగా ఉంటే అటు ఇంటి పనులు, ఇటు బయటి పనులు, ఆఫీస్‌ వర్క్‌.. వీటన్నింటితో 24 గంటల సమయం కూడా సరిపోదు. అదే అందరితో కలిసుంటే ఇంటి పనుల్ని నలుగురు పంచుకుంటారు. తద్వారా పని త్వరగా పూర్తవుతుంది.. మీకంటూ, మీ పిల్లల కోసం కేటాయించడానికి కాస్త సమయం దొరుకుతుంది. తద్వారా తమ పేరెంట్స్‌ని మిస్సవుతున్నామన్న భావన పిల్లల్లో కలగదు. పైగా ఇలా బోలెడంత సమయం చిక్కే సరికి అన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులకు-పిల్లలకు మధ్య ఇలాంటి స్నేహబంధమే ఉండాలంటున్నారు నిపుణులు.

ఆ జ్ఞాపకాలు పదిలంగా..!

మనకే కాదు.. చాలామంది పిల్లలకూ కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువమందితో కలిసి.. అది తమ తోటి వారితో వెళ్తే వాళ్లు మరింతగా ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటప్పుడూ ఉమ్మడి కుటుంబమే వర్కవుట్‌ అవుతుంది. వాళ్ల కజిన్స్‌/ఒకే వయసులో ఉన్న పిల్లలతో ఆడుకోవడం, ఫొటోలు దిగడం.. ఇలా వాళ్ల ప్రపంచమే వేరుగా ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకాలు వారికి భవిష్యత్తుకు సరిపడా మధురానుభూతుల్ని పంచుతాయి. అంతేకాదు.. ఇలా ఎప్పుడూ హ్యాపీగా గడిపే పిల్లలు శారీరకంగా, మానసికంగానూ చురుగ్గా ఉంటారని పలు అధ్యయనాలు కూడా రుజువు చేస్తున్నాయి.

సో.. ఎటు నుంచి చూసినా ఒంటరిగా కంటే ఉమ్మడి కుటుంబంలో పెరిగిన చిన్నారులకే ఎక్కువ ప్రయోజనాలున్నాయని అర్థమవుతోంది. మరి, మీది కూడా ఉమ్మడి కుటుంబమేనా? మీ పిల్లలూ అందరితో కలిసి ఇలా ప్రతి క్షణం సంతోషంగా, సరదాగా గడుపుతుంటారా? అయితే ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల పిల్లలకు ఇంకా ఎలాంటి సానుకూల ప్రయోజనాలుంటాయంటారు? మీ అభిప్రాయాలు, సలహాలను వసుంధర.నెట్‌ వేదికగా పంచుకోండి..!మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని